ప్రాజెక్టా? ఫారెస్టా?

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట. కర్ణాటకలో కట్టాలని చూస్తున్న ఓ నీటి ప్రాజెక్టు ఇలాగే తయారైంది. రాజధాని బెంగళూరుకి మంచి నీళ్లు​​ అందించటం కోసం మేకెదాటు డ్యామ్ నిర్మించాలని పదహారేళ్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రభావం కావేరీ వైల్డ్​ లైఫ్​ శాంక్చువరీపై తీవ్రంగా పడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది సమ్మర్​లో దేశంలోని చాలా నగరాల్లో మంచి నీటికి తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఈ సిటీల లిస్టులో కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా ఉంది. అక్కడ ఏటా మంచి నీళ్లకు డిమాండ్​ పెరుగుతోంది. దీంతో ఆ కొరతను తీర్చటానికి ప్రభుత్వం మేకెదాటు ప్రాజెక్టు కట్టాలని 16 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తోంది. దీనికోసం దక్షిణ కర్ణాటకలోని రామనగరం జిల్లాలో కావేరీ నదిపై డ్యామ్​ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసింది. బెంగళూరుకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది ఒక వైల్డ్​ లైఫ్​ శాంక్చువరీ గుండా ప్రవహిస్తోంది. దానిని ‘కావేరీ వైల్డ్​ లైఫ్​ శాంక్చువరీ’గా పిలుస్తారు. దట్టమైన, అందమైన ఈ అటవీ విస్తీర్ణం 1,000 చదరపు కిలోమీటర్ల పైమాటే. చాలా అరుదైన మొక్కలు, జంతువులు ఇక్కడ ఉన్నాయి. కొన్ని ప్రాణులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

మునిగిపోవటం ఖాయం

మేకెదాటు డ్యామ్​ని శాంక్చువరీలోని ఆర్కవతి, కావేరీ నదులు కలిసే ప్రాంతం (సంగమం) వద్ద 67 టీఎంసీల కెపాసిటీతో కట్టాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇది కడితే సుమారు 50 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం డ్యామ్​లో మునిగిపోతుంది. అరుదైన ప్రాణులపై ఈ ప్రాజెక్టు ఎఫెక్ట్​ ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. డ్యామ్​ నిర్మాణ పనుల కోసం భారీ సంఖ్యలో చెట్లు నరికేయాల్సి వస్తుంది. వాటితోపాటు ఆరెంజ్​ కలర్​ పొలుసులు గల మహ్​సీర్​ అనే ఒక జాతి చేపలు, పెద్ద రకం ఉడుతలు శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ‘దేశంలోని విలువైన, పరిమితమైన గ్రీన్​ కవర్​ని ఇకనైనా కంటికి రెప్పలా కాపాడుకుందాం’ అంటూ కొన్నేళ్లుగా పోరాడుతున్న యాక్టివిస్టుల కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

ఒక్క వేటుతో నూరేళ్లు నిండుతాయి

మేకెదాటు ప్రాజెక్టులో ముంపుకు గురయ్యే అటవీ ప్రాంతం సంగతి అలా ఉంచితే… అసలు డ్యామ్​ కడుతున్న సమయంలోనే చాలా ఫారెస్ట్​ ఏరియా నేలమట్టమవుతుంది. అడవిలో నేచురల్​గా పుట్టి పెరిగే అర్జున, చింత చెట్లను, ఆర్కవతి, కావేరీ తీరాల్లోని మలబార్​ పండ్ల మొక్కలను నరికేస్తారు. ఇందులోని కొన్నింటి వయసు వందేళ్లకుపైగా ఉంటుంది. బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లు, మెషీన్​  గొడ్డళ్లతో వాటి జీవితానికి ఒక్క పూటకే ఈనూరేళ్లు నిండుతాయి.

పచ్చదనంపై పెరుగుతున్న మక్కువ

‘కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో అడవులు, గుట్టలు, కొండలు, కోనలు, లోయలను కాపాడుకోవటం చాలా అవసరం’ అనే అంశంపై దేశ ప్రజల్లో మునుపటికన్నా  అవగాహన పెరుగుతోంది. డ్రింకింగ్​ వాటర్, ఇరిగేషన్​​ డ్యామ్​లు, పవర్​ జనరేషన్ ప్రాజెక్టులు, గనుల తవ్వకాలతో ప్రభుత్వాలు పచ్చదనానికి పాతర వేయడం మంచిది కాదని పర్యావరణ కార్యకర్తలు అంటున్నారు. ఈ పోరాటంలో సిటిజన్లు, యాక్టివిస్టులు పట్టుదలతో, ఉత్సాహంతో పాల్గొంటున్నారు.

ధర్నాలతో దిగొచ్చిన ఛత్తీస్​గఢ్

ఛత్తీస్​గఢ్​లోని హస్డియో అరంద్ ఫారెస్ట్​ ఏరియాలో బొగ్గు తవ్వకాలకు ప్లాన్​ వేశారు. అక్కడ ఏనుగుల పరిరక్షణ కేంద్రం​ ఉంది. ఏనుగుల మనుగడపై ప్రభావం పడుతుందని స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో భూపేశ్​ బాఘెల్​ నాయకత్వంలోని ప్రభుత్వం బొగ్గు ప్రాజెక్ట్​కి ఫుల్​స్టాప్​ పెట్టింది.

ఇతర రాష్ట్రాలను ఫాలో కాని కర్ణాటక

పచ్చని చెట్లను నరికేస్తామంటే పబ్లిక్​ ఊరుకోవట్లేదు. దీనికి ఛత్తీస్​గఢ్​లో ఈమధ్య ఎదురైన అనుభవమే రుజువు​. అయితే కర్ణాటక వీటిని లెక్కలోకి తీసుకోవట్లేదు. పైగా రివర్స్​లో వస్తోంది. ‘సహజ, వారసత్వ సంపదలను కాపాడడం ఎంత ముఖ్యమో, ప్రజల దప్పిక తీర్చడమూ అంతే ముఖ్యం’ అని లాజిక్​ ఉపయోగిస్తోంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి సివిల్​ సొసైటీల సాయం తీసుకుంటోంది.

తమిళనాడు అభ్యంతరం

మేకెదాటు ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై కర్ణాటక చేస్తున్న స్టడీ నిలిపివేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామి కేంద్రానికి కిందటేడాది లెటర్​ రాశారు. కావేరి నదీ జలాల పంపకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి కర్ణాటక తీరు వ్యతిరేకంగా ఉందని అభ్యంతరం తెలిపారు. కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది ఒకే పార్టీ (బీజేపీ) కాబట్టి మోడీ సర్కార్​ నుంచి ఎలాంటి రియాక్షన్​ వస్తుందోననే ఆసక్తి నెలకొంది.

‘కావేరీ కాలింగ్​’కి సూపర్​ రెస్పాన్స్​

నదుల రక్షణ కోసం ఆధ్యాత్మిక గురు జగ్గీ వాసుదేవ్‌‌ మొదలెట్టిన ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ‘కావేరీ కాలింగ్’ పేరుతో ఈశా ఫౌండేషన్​ నడిపిస్తున్న ఈ పోరాటానికి లేటెస్ట్​గా ‘టైటానిక్‌‌’ హీరో లియోనార్డో డికాప్రియో, బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ తదితర సెలబ్రిటీలు సపోర్ట్​ చేశారు. ఈ మూమెంట్​కి కంగన 42 లక్షల రూపాయలు విరాళంకూడా ఇచ్చారు. ఈశా ఫౌండేషన్ లక్షల మంది రైతులను కూడగడుతూ కావేరీ నదీ తీరంలో 242 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.

Fight For to stop the Mekedatu dam project inside the Cauvery wildlife sanctuary