మంత్రి కోమటి రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం

  • మాజీ మంత్రి మాధవరెడ్డి మహనీయుడు

  • వార్డు సభ్యుడిగా గెలవలేనోడు విమర్శిస్తాడా

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • రైతులను చెప్పుతో కొట్టాలనడం సరికాదు

  • జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి 

  • కాంగ్రెస్, బీఆర్ఎస్​కార్యకర్తల నినాదాలు

  • గూడూరులో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు

 భువనగిరి:  గ్రామపంచాయతీ సాక్షిగా మంత్రి, జడ్పీ చైర్మన్​మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఇవాళ యదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో  పలు అభివృద్ధి పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడమే కాకుండా బీఆర్ఎస్  పై బురద జల్లడం సరికాదన్నారు. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలని మంత్రి అనడం మంచి పద్ధతి కాదని సూచించారు.

దీంతో మంత్రి కోమటిరెడ్డి  వెంటనే లేచి మాజీ మంత్రి మాధవరెడ్డి మహానీయుడని, ఆయన కొడుకు బచ్చా అంటూ.. కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేనోడు తనను విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు. వెంటనే ఆయనను బయటకు పంపాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.  దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది.  ఇంతలోనే కాంగ్రెస్ శ్రేణులు స్టేజీపైకి వచ్చి హంగామా సృష్టించి ఒక్కసారిగా జడ్పీ చైర్మన్ పైకి దూసుకెళ్లారు. దీంతో జడ్పీ చైర్మన్ ను పోలీసులు,బీఆర్‌ఎస్‌ శ్రేణులు అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.