ఆర్టికల్ 370 ఇష్యూ: వాగ్వాదం, పిడిగుద్దులతో దద్దరిల్లిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ

ఆర్టికల్ 370 ఇష్యూ: వాగ్వాదం, పిడిగుద్దులతో దద్దరిల్లిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ

శ్రీనగర్: ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనే తీర్మానంపై గురువారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఫైటింగ్ కు దారితీసింది. దీంతో స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సభ బయటకు పంపించారు. ఉదయం అసెంబ్లీలో బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు షేక్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజాద్ లోన్‌, పలువురు ఎమ్మెల్యేలు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను పునరుద్ధరించాలనే బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించారు. బుధవారం సభ ఆమోదించిన తీర్మానం సరిగా లేదని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

మరోవైపు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. సభలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మాట్లాడుతుండగా.. షేక్ ఖుర్షీద్ బ్యానర్‌తో వెల్‌లోకి వచ్చాడు. దీంతో బీజేపీ సభ్యులు అతని వైపు దూసుకెళ్లి బ్యానర్‎ను లాక్కొని చింపేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సజాద్ లోన్, ఇతర ఎమ్మెల్యేలు వచ్చి బీజేపీ సభ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా, పరస్పరం పిడిగుద్దులతో ఫైటింగ్‎కు దిగారు.

ఘర్షణ తీవ్రం కావడంతో స్పీకర్ మార్షల్స్‎ను ఆదేశించడంతో వారు వచ్చి ఇరు పక్షాలను విడిపించారు. తర్వాత రెండు వర్గాల సభ్యులు తీర్మానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను చెప్పారు. సభ వెలుపల సజాద్ లోన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఖుర్షీద్‌పై పతిపక్ష సభ్యులు దాడి చేస్తున్నప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. 

ఆర్టికల్ 370 పునరుద్ధరణపై అసెంబ్లీలో చర్చ లేకుండా బుధవారం ఆమోదించిన తీర్మానం ఏకపక్షమని బీజేపీ విమర్శించింది. ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. తీర్మానాన్ని బీజేపీ తిరస్కరిస్తున్నదని అన్నారు. తీర్మానాన్ని ఉపసంహరించుకునేంత వరకు సభను నడవనివ్వబోమన్నారు. స్పీకర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.