
ముంబై: వరుసగా నాలుగో రోజు కూడా మార్కెట్లు పెరిగాయి. అమెరికా–-జపాన్ సుంకాల చర్చలు, ఎఫ్‌ఐఐ ఇన్‌ఫ్లోల మధ్య ఇండెక్స్‌లు గురువారం (ఏప్రిల్ 17) దాదాపు 2 శాతం వరకు లాభపడ్డాయి. 30-షేర్ల బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,508.91 పాయింట్లు పెరిగి 78 వేల స్థాయిని తిరిగి అందుకుంది. చివరకు 78,553.20 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 1,572.48 పాయింట్లు పెరిగి 78,616.77 వద్దకు చేరుకుంది. బీఎస్ఈలో 2,427 స్టాక్‌లు పుంజుకోగా, 1,522 నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 414.45 పాయింట్లు పెరిగి 23,851.65 వద్ద ముగిసింది.
ఈ నాలుగు రోజుల్లో, బీఎస్ఈ సెన్సెక్స్ 4,706.05 పాయింట్లు (6.37 శాతం), నిఫ్టీ 1,452.5 పాయింట్లు (6.48 శాతం) పెరిగింది. "బెంచ్‌మార్క్ సూచీలు గురువారం భారీ లాభాలను నమోదు చేశాయి. వరుసగా నాలుగు సెషన్లలో లాభాలను సంపాదించాయి. బ్రాడర్ మిడ్, స్మాల్ క్యాప్‌లూ ర్యాలీ చేశాయి. యూఎస్ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి.
దీనికితోడు బలహీనమైన ప్రపంచ సంకేతాల కారణంగా మన మార్కెట్లు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రమంగా పైకి ఎగబాకాయి. ప్రైవేటు బ్యాంకులకు నాలుగో క్వార్టర్లో లాభాలు రావడంతో వాటి షేర్లు పెరిగాయి”అని లెమన్ మార్కెట్స్ డెస్క్ ఎనలిస్ట్ సతీష్ చంద్ర అలూరి అన్నారు. సెన్సెక్స్ సంస్థలలో కంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, మారుతి వెనకబడ్డాయి.
దూసుకెళ్లిన సెక్టోరల్ సూచీలు
బీఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.56 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం పెరిగింది. బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. బ్యాంకెక్స్ 2.56 శాతం, టెలికమ్యూనికేషన్ (2.22 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (2 శాతం), సర్వీసెస్ (1.47 శాతం), టెక్ (1.19 శాతం), ఎనర్జీ (1.13 శాతం), ఆటో (1.01 శాతం) హెల్త్‌కేర్ (0.91 శాతం) పెరిగాయి. ఎఫ్‌ఐఐలు బుధవారం రూ.3,936.42 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. మంగళవారం రూ.6,065.78 కోట్లకు ఈక్విటీలను కొన్నారు.
ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్, టోక్యో నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ లాభపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం యూఎస్ మార్కెట్లు భారీగా తగ్గాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.94 శాతం పెరిగి బ్యారెల్‌కు 66.47కి చేరుకుంది. సెన్సెక్స్ బుధవారం 309.40 పాయింట్లు, నిఫ్టీ 108.65 పాయింట్లు పెరిగింది. గుడ్ ఫ్రైడే కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు.