- హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నం
- సీఎం రిలీఫ్‌ఫండ్‌కు నెల జీతం విరాళం ఇస్తున్న
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాదు క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించి రూ.10వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్‌చేశారు.
ALSO READ | పార్టీ ఫిరాయింపుల ఇష్యూ: హైకోర్టు తీర్పుపై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
వరద బాధితుల సహాయార్థం ఒక నెల జీతం (రూ.2.50 లక్షలు) సీఎం రిలీఫ్‌ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు కూనంనేని ప్రకటించారు. ఈనెల 11 నుంచి తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాతలను రాష్ట్రవ్యాప్తంగా జరపాలని నిర్ణయించామని, 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో కూనంనేని మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. యుటిలిటీ నిధులు వాడుకోవాలని అని కిషన్ రెడ్డి అనడం కరెక్ట్ కాదన్నారు. అసలు ఆయనకు మానవత్వం లేదన్నారు. శాస్త్రీయంగా అంచనాలు వేసి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కేంద్రం మావోయిస్టు పేరుతో ఊచకోత మొదలు పెట్టిందని, ప్రశ్నించే వారి గొంతు నొక్కేలా ప్రవర్తిస్తే ఇండియా కూడా బంగ్లాదేశ్, శ్రీలంకలాగా అవుతుందని హెచ్చరించారు. నేటి యువతకు తెలంగాణ సాయుధ పోరాటం విలువ తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.