కాగజ్ నగర్, వెలుగు : ఐపీఎస్ ఆఫీసర్‌గా 26 యేండ్ల పాటు ఉద్యోగం చేసిన తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, బహుజన రాజ్యం కోసం తొలిసారి ఎమ్మెల్యేగా సిర్పూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశానని, అది కూడా రాష్ట్రంలో తొలి నియోజకవర్గం సిర్పూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం ఆనందాన్ని ఇచ్చిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన శుక్రవారం సిర్పూర్ తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీకి నామినేషన్ అందజేశారు. తర్వాత ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలే తన కుటుంబమని, తనను అక్కున చేర్చుకున్న సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని, బహుజన రాజ్యం కోసం సిర్పూర్ నుంచే బీజం పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.