గజ్వేల్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామ యువకుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ వేములఘాట్‌కు చెందిన నీరుడి ప్రసాద్ నామినేషన్ పత్రాలను శనివారం ఎన్నికల అధికారికి అందజేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని, అందుకు నిరసనగా తాను ఇక్కడ పోటీ చేస్తున్నానని చెప్పాడు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ముంపు గ్రామాల్లో దళారులు లబ్ధి పొందారని, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు నిరాశే మిగిలిందన్నారు. గజ్వేల్‌లో ఆర్‌అండ్ఆర్ కాలనీలో నాణ్యత లేని ఇండ్లు కట్టించి, తమని దిక్కు లేని వారిని చేశారని ఆరోపించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. తమ గోడు ప్రపంచానికి తెలపడానికే మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ దాఖలు చేశానని తెలిపాడు.