- ఇప్పుడు పార్టీ పదవులే!
- అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులేంది అంటున్న నేతలు
- నామినేటెడ్ పోస్టులేకావాలంటున్న సీనియర్లు
- ‘స్థానిక’ సమరంలో క్యాడర్లోజోష్ నింపడం ఇటు సీఎంకు అటు పీసీసీకి పరీక్ష
హైదరాబాద్, వెలుగు: పీసీసీ పదవులు తప్ప నామినేటెడ్ పదవులు ఇప్పట్లో భర్తీచేసే అవకాశం లేకపోవడంతో పలువురు సీనియర్ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవులు కోరుకుంటామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు ఆశిస్తామని పలువురు సీనియర్లు తమ మనస్సులోని మాటను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కీలకమైన కార్పొరేషన్లు, ఇతర పదవులు ఖాళీగానే ఉన్నాయని, పార్టీ గెలుపు కోసం పనిచేసిన తమ లాంటి వారు ఏదో ఒక ప్రభుత్వ పదవిని కోరుకుంటామని స్పష్టం చేశారు.
లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామినేటెడ్ పదవులను భర్తీచేస్తే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతల్లో జోష్ వస్తుందని.. అది స్థానిక ఎన్నికల గెలుపుకు కారణమవుతుందని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పనిచేసినా... తమకు ఇప్పటి వరకు కార్పొరేషన్ పదవులు రాకపోవడంతో మళ్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలంటే ఉత్సాహం రావడం లేదని అంటున్నారు. త్వరలోనే పీసీసీ కార్యవర్గం ప్రకటిస్తామని రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినా... అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా నామినేటెడ్ పదవి ఆశిస్తారని పార్టీ నేతలంటున్నారు.
ఇలాంటి సమయంలో పార్టీ పదవులు ఇచ్చి, నామినేటెడ్ పదవులను ఆపితే తమను నిరాశకు గురిచేస్తుందంటున్నారు. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు, నాలుగు నెలలకు 37 కార్పొరేషన్ పదవులు, కొన్ని రాజ్యాంగబద్ధమైన కమిషన్లతో పాటు మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ కమిటీలు, టెంపుల్ కమిటీలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు భర్తీ చేసినా.. ఇంకా కీలకమైన కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది.
ఆర్టీసీ, మూసీ రివర్ ఫ్రంట్, సివిల్ సప్లయ్, రెడ్కో వంటి
కీలకమైన కార్పొరేషన్లపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇవి కాకుండా పలు రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. అయితే, లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ నేతల పనితీరును బట్టి మిగిలిన నామినేటెడ్ పదవులివ్వాలనే ఆలోచనతో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వం ఈ విధమైన ఆలోచన చేస్తే.. లోకల్ బాడీ ఎన్నికల ముందు తమకు నామినేటెడ్ పదవులు కట్టబెడితే జోష్తో పార్టీ కోసం మరింత కష్టపడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు పార్టీ నేతలను బుజ్జగించి, లోకల్ బాడీ సమరంలో చురుగ్గా పాల్గొనేలా చేయడం ఇటు సీఎం, అటు పీసీసీ నాయకత్వానికి పరీక్షగా నిలిచింది.