హైదరాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. -ఆన్లైన్ జాబ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. డిసబిలిటీని దృష్టిలో పెట్టుకొని వారిని ముందుకు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సెక్రటేరియట్లో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరేట్ హెల్ప్ లైన్లో 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ సంక్షేమం, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామని.. ప్రైవేటు జాబ్ లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాల్లోనూ వారికి రిజర్వేషన్లు పాటిస్తామన్నారు. దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.50 కోట్లు వెచ్చించడంతోపాటు స్వయం ఉపాధి కోసం చేయూతనిస్తామని చెప్పారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టామని పేర్కొన్నారు. అవకాశాలను బట్టి ఏ రంగం మీద మక్కువగా ఉంటే ఆ రంగంలోకి వెళ్లి పని చేయాలని సూచించారు.