ఆలస్యం అవుతున్న గురుకుల ఉద్యోగాల భర్తీ

  • ఎంప్యానల్‌‌‌‌‌‌‌‌ లేదంటూ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన ఆఫీసర్లు
  • రాష్ట్రంలో లేని రూల్‌‌‌‌‌‌‌‌ సూర్యాపేటలోనే ఎందుకంటున్న నిర్వాహకులు

సూర్యాపేట, వెలుగు : గిరిజన గురుకులాల్లో ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల భర్తీ కోసం ఏజెన్సీ ఎంపికలో ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్స్‌‌‌‌‌‌‌‌ ఒక్క సూర్యాపేట జిల్లాలో మాత్రమే అమలు చేస్తుండడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ఎంపికకు టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ కొందరు వ్యక్తుల ఒత్తిడి మేరకే రూల్స్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఏజెన్సీ ఎంపికను పక్కన పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీని వల్ల ఉద్యోగుల ఎంపిక ఆలస్యం అవుతుండడంతో ఆఫీసర్ల తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట ఒక్కటే పెండింగ్‌‌‌‌‌‌‌‌

సూర్యాపేట జిల్లాలోని ఐదు గిరిజన గురుకులాల్లో ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలను భర్తీ చేసే ఏజెన్సీల కోసం జూన్‌‌‌‌‌‌‌‌ 24న ఆఫీసర్లు టెండర్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి, అప్లై చేసుకునేందుకు జూన్‌‌‌‌‌‌‌‌ 30న లాస్ట్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌గా నిర్ణయించారు. సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై డీఎం చైర్మన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తూ జులై 7న టెండర్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేశారు. టెండర్లలో మొత్తం ఎనిమిది ఏజెన్సీలు పాల్గొనగా స్థానికంగా లేవంటూ రెండు ఏజెన్సీలను, టెక్నికల్‌‌‌‌‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌తో మరో మూడు ఏజెన్సీలను రిజక్ట్‌‌‌‌‌‌‌‌ చేయగా మూడు ఏజెన్సీలు మాత్రమే మిగిలాయి. టెండర్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసిన రోజునే రీజినల్‌‌‌‌‌‌‌‌ కో ఆర్డినేటివ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంప్యానల్‌‌‌‌‌‌‌‌ లేదన్న సాకుతో ఇప్పటివరకు ఏజెన్సీ ఎంపికను పూర్తి చేయలేదు. కానీ అదే అధికారి యాదాద్రి, నల్గొండ జిల్లాలో మాత్రం ఎంప్యానల్‌‌‌‌‌‌‌‌ లేకున్నా ఏజెన్సీలను ఖరారు చేయడం గమనార్హం. అయితే లోకల్‌‌‌‌‌‌‌‌ కాదంటూ కొన్ని ఏజెన్సీలను రిజక్ట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో కొందరు వ్యక్తుల ఒత్తిడి మేరకే సూర్యాపేట జిల్లాకు ఏజెన్సీ ఎంపిక చేయకుండా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎంప్యానల్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండానే ఏజెన్సీని ఎంపిక చేయాలని రూల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గతంలో కూడా డబ్బులు తీసుకొని అర్హత లేని ఏజెన్సీని ఎంపిక చేశారని, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఎంప్యానల్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతోనే... 

రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఎంప్యానల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఏజెన్సీలకే ఉద్యోగాల భర్తీ అప్పగించాలని ఉన్నందునే సూర్యాపేటలో ఏజెన్సీ ఆలస్యం అవుతోంది. ఎంప్యానల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పూర్తికాగానే ఏజెన్సీని ఎంపిక చేస్తాం.

కె.లక్ష్యమ్మ, ఆర్‌‌‌‌‌‌‌‌సీవో