- నాగ చైతన్య, సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు
- మా కుటుంబ పరువుకు నష్టం కలిగించారు
- పిటిషన్లో ప్రస్తావన.. నేడు నాంపల్లి కోర్టు విచారణ
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్, సోషల్‌మీడియా లింక్స్‌తో గురువారం నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువునష్టానికి సంబంధించి బీఎస్‌ఎస్ 356 కింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
‘‘నా కుమారుడు అక్కినేని నాగచైతన్య, సమంతకు 2017లో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య తలెత్తిన వ్యక్తిగత వ్యత్యాసాలతో మ్యూచువల్‌గా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత ఎవరికి వారు తమ ప్రొఫెషన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే.. మా కుటుంబ పరువుకు భంగం వాటిల్లే విధంగా మంత్రి కొండా సురేఖ నిరాధారణమైన వ్యాఖ్యలు చేశారు” అని నాగార్జున పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగనుంది.