ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. 2024, డిసెంబర్ 10వ తేదీన జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘర్షణలో ఆయన గాయపడ్డట్లు సమాచారం. మోహన్ బాబును వెంటనే ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. బీపీ ఎక్కువ కావడంతోనే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు డాక్టర్స్.
అంతకుముందు ఏం జరిగిందంటే..?
మంగవారం (డిసెంబర్ 10) రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వచ్చిన ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్, అతడి భార్య మౌనికను ఇంట్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ కారును ఇంటి బయట గేట్ దగ్గరే సిబ్బంది ఆపేశారు. కారు దిగిన మనోజ్ దంపతులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో చాలా సేపు గేట్ వద్ద నిల్చున్న మనోజ్ మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన కూతురు లోపలే ఉందని.. తనను ఇంట్లోకి వెళ్లనివ్వాలని మనోజ్ సిబ్బందిని కోరాడు.
ALSO READ | అన్నను చంపుతానని బెదిరించావ్.. మనోజ్‌తో విభేదాల వేళ సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
అయినప్పటికీ సిబ్బంది ఇంట్లోకి రావడానికి అనుమతించకపోవడంతో చేసేదేమి లేక బలవంతంగా గేట్లు తోసుకుని మనోజ్ ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఇంట్లోకి వెళ్లిన జరల్నిస్టులపై మోహన్ బాబు దాడికి దిగారు. తీవ్ర కోపాద్రిక్తుడైన ఆయన జర్నలిస్టుల మైకులు, కెమెరాలు లాక్కున్నాడు. మీడియా ప్రతినిధుల చేతిలోని మైకులు, కెమెరాలను లాక్కుని దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్ట్‌లకు గాయాలు అయినట్లు సమాచారం. కొడుకుతో వివాదం, జర్నలిస్టులపై దాడి ఘటనలతో టెన్షన్‌కు గురై మోహన్ బాబు అస్వస్థతకు గురి అయినట్లు సమాచారం.