- 9 మంది నిర్వాహకులు సహా 88 మందిపై అభియోగాలు
- ఎమ్‌డీఎమ్‌ఏ, కొకైన్, గంజాయి తీసుకున్నట్లు మెడికల్ రిపోర్ట్స్
- నటి హేమ ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్స్ తీసుకున్నట్లు కోర్టుకు తెలిపిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: సినీ నటి హేమ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు నిర్ధారించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో మే 15న జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 9 మంది నిర్వాహకులు సహా 88 మందిపై అభియోగాలు మోపారు. హేమ సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు స్థానిక కోర్టులో 1086 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
పార్టీ నిర్వాహకుడు ఎల్.వాసు, డెంటల్ డాక్టర్ రణధీర్‌బాబు, డ్రగ్స్ సప్లయర్స్ అరుణ్‌కుమార్, నాగబాబు, నైజీరియన్ పెడ్లర్ అబూబాకర్ సహా మొత్తం 9 మందిని ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. ఈ చార్జ్‌షీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.
చార్జ్‌షీట్ అంశాలివే..
ఏపీకి చెందిన ఎల్.వాసు ఈ ఏడాది మే 15న రేవ్ పార్టీ నిర్వహించాడు. ఇందులో ఏపీ, తెలంగాణ, కర్నాటక నుంచి దాదాపు 180 మంది పాల్గొన్నారు. వారిలో తెలుగు సినీ నటి హేమ అలియాస్ కృష్ణవేణి కూడా ఉన్నారు. పార్టీలో ఇల్లీగల్ యాక్టివీటిస్ జరుగుతున్న సమాచారంతో పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. పార్టీకి హాజరైన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, నైజీరియన్ మహ్మద్ అబూబకర్, అగస్టిన్ దాదా డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు గుర్తించారు.
అందరి బ్లెడ్ శాంపిల్స్ సేకరించారు. బ్లడ్ టెస్టులో నటి హేమ సహా 79 మందికి డ్రగ్ కంటెంట్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో వీరిపై కేసు నమోదు చేశారు. అయితే, తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని బెంగళూరుకు వెళ్లలేదని హేమ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. కానీ కర్నాటక పోలీసులు జరిపిన టెస్ట్‌లో మాత్రం ఆమె ఎమ్‌డీఎమ్‌ఏ తీసుకున్నట్లు బయటపడింది. ఇప్పుడు ఆమెపై డ్రగ్స్ కేసుతో పాటు వీడియో రిలీజ్ చేసినందుకు మరో కేసు నమోదు చేశారు.
నాకు నెగిటివ్ వచ్చింది:-హేమ, నటి
“నా పేరు చార్జ్‌షీట్‌లో పెట్టారని ప్రచారం జరిగింది. కానీ, మా లాయర్ నాకు గుడ్ న్యూస్ చెప్పారు. నాకు డ్రగ్స్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. చార్జ్‌షీట్‌లో కూడా నెగిటీవ్ అనే రాశారని తెలిపారు. నేను డ్రగ్స్ తీసుకోలేదని గతంలోనే చెప్పాను. ఇప్పుడు అఫీషియల్‌గా నెగిటీవ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది’’ అని హేమ పేర్కొన్నారు.