యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సినీ నటి మంచు లక్ష్మీ సందర్శించారు. చాముండేశ్వర్ నాథ్ తో కలిసి ఆలయానికి వచ్చిన ఆమె స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భువనగిరి మండలంలోని వడపర్తి ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ ల్యాబ్ ను ప్రారంభించారు.
ఇవాళ టీచర్స్ డే సందర్భంగా తాను దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను మంచు లక్ష్మి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన విందు ఏర్పాటు చేసిన మంచు లక్ష్మి.. పాఠశాలలో విద్యార్థులతో మమేకం అయ్యారు.
ఈ సందర్బంగా మీడియాతో మంచులక్ష్మి మాట్లాడుతూ తన సేవా కార్యక్రమాల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని.. రాజకీయ ఆలోచనే లేదన్నారు. పూర్తిగా సేవాభావంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అక్కడ చదువుతున్న నిరుపేద విద్యార్థులకు, పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తనవంతు ప్రోత్సహం అందించాలన్నదే లక్ష్యమన్నారు. సర్కార్ స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులను తనవంతు చేతనైనంత వరకు ప్రోత్సాహం కల్పిస్తానని.. తన సంపాదనతో వీలైనంత ఎక్కువ మందికి మంచి విద్య అందించాలన్న లక్ష్యంతోనే కార్యక్రమాలు చేస్తున్నానని మంచు లక్ష్మి వివరించారు.