కరీంనగర్ టౌన్, వెలుగు: పేద విద్యార్థులకు డిజిటల్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని సినీ నటి, టీచ్ ఫర్చేంజ్చైర్పర్సన్ మంచు లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం సిటీలోని కోతిరాంపూర్(పోచంపల్లి) ప్రైమరీ స్కూల్‌లో టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూంను కలెక్టర్ పమేలాసత్పతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవిద్యార్థులకు ఆధునిక పద్ధతిలో విద్య అందించేందుకు కరీంనగర్ జిల్లాలో 20 ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేశామని వెల్లడించారు.
ఈ స్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ విద్య అందిస్తామన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతోనే కరీంనగర్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లను ఎంపిక చేసుకున్నామని స్పష్టం చేశారు. సత్పతి మంచి కలెక్టర్ అని, ఆమె యాదాద్రిలో పనిచేస్తున్నప్పుడు కూడా 50 స్కూళ్లను డెవలప్ చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈఓ జనార్దన్ రావు, కార్పొరేటర్ మర్రి భావన, ప్లానింగ్ ఆఫీసర్ అబ్దుల్ బరి, టీచ్ ఫర్ చేంజ్ ప్రతినిధి ఆయుబ్, హెచ్ఎం సంపత్ రావు, పాల్గొన్నారు.