బెనిఫిట్ షోల రద్దు మంచిదే.. సింగిల్ స్ర్కీన్‎కు ఊపిరి పోసేలా CM రేవంత్​ డెసిషన్స్​

బెనిఫిట్ షోల రద్దు మంచిదే.. సింగిల్ స్ర్కీన్‎కు ఊపిరి పోసేలా CM రేవంత్​ డెసిషన్స్​
  • ఫిల్మ్ చాంబర్ ఎగ్జిబిటర్స్​అసోసియేషన్ నేతల వెల్లడి
  • టికెట్ రేట్ల పెంపు ఉండదనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం
  • సింగిల్ స్ర్కీన్​కు ఊపిరి పోసేలా సీఎం రేవంత్​ డెసిషన్స్​
  • కొంతమంది ప్రొడ్యూసర్స్​వల్లే ప్రేక్షకులకు ఇబ్బంది
  • పుష్ప2 టికెట్ ​500 చేయడంతో నష్టపోయామని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నేతలు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలు సింగిల్ స్ర్కీన్ థియేటర్లకు ఊపిరి పోసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బెనిఫిట్‌‌ షోలు, టికెట్‌‌ ధరల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో సోమవారం ఫిల్మ్ చాంబర్‌‌ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.

ఈ క్రమంలో టికెట్ల రేట్ల విషయమై సీఎం రేవంత్‌‌రెడ్డి నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టికెట్‌‌ ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌‌ నేతలు చెప్పారు. అనంతరం  ఫిల్మ్ నగర్‎లోని అసోసియేషన్ కార్యాలయంలో ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ బాల గోవింద రాజులు, ఏపీ ఎగ్జిబిటర్ నేత రాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

కొత్త సినిమా విడుదలైన రెండు, మూడు రోజులు అభిమానులు, కాలేజ్‌‌ స్టూడెంట్స్‌‌, యువత, మాస్‌‌ ఎక్కువగా చూస్తారని, ఇలా టికెట్‌‌ ధరలు పెంచి, వారి నుంచి అధికంగా వసూళ్లు చేయడం బాధాకరంగా ఉందని విజయేందర్ రెడ్డి అన్నారు. సలార్, కల్కి మూవీకి రూ. 250 లోపు టికెట్ ఉండటంతో థియేటర్లకు మంచి కలెక్షన్లు వచ్చాయని చెప్పారు. పుష్ప మూవీ టికెట్​రేటును రూ. 500 చేయడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు వెనుకాడారని, దీంతో తమకు చాలా నష్టాలు వచ్చాయన్నారు. 

నిర్ణీత మొత్తంలోనే టికెట్ల ధరలుండాలి

మల్టిప్లెక్స్ లకు గ్రూప్ లుగా దేశవ్యాప్తంగా వేల స్ర్కీన్స్​ ఉండటం వల్ల వారికి నష్టాలు వచ్చినా ఇబ్బంది ఉండదని, సింగిల్ స్ర్కీన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందని విజయేందర్ రెడ్డిపేర్కొన్నారు. అన్ని సినిమాలకు నిర్ణీత మొత్తంలోనే టికెట్‌‌ ధరలు ఉండేలా చూడాలని తెలంగాణ ఫిల్మ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ (టీఎఫ్‌‌డీసీ) చైర్మన్‌‌ దిల్‌‌ రాజును కోరినట్టు ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌‌, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. 

 ప్రీమియర్‌‌ షోల పేరిట రూ.1200 టికెట్‌‌ ధర పెడితే, అదే ధర ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారని, ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ విషయంలో కూడా అనేక రకాలుగా ధరలు నిర్ణయించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సింగిల్  స్క్రీన్‌‌ థియేటర్లకు మరో నాలుగేండ్లపాటు ప్రాణం పోసినట్టు ఉన్నదని చెప్పారు. ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసి డబ్బులు రావాలనుకోవాలని కానీ, తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయలన్న నిర్మాతల నిర్ణయం సరైనది కాదని అన్నారు. 

ఏడాదిలో 80 శాతం మిడిల్‌‌ బడ్జెట్‌‌ సినిమాలు వస్తున్నాయని, పెద్ద బడ్జెట్‌‌ సినిమాలకు టికెట్‌‌ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు ఆ ఒక్క సినిమానే చూసి.. మరో దానికి వెళ్లడం లేదని, దీంతో చిన్న  సినిమాలు దెబ్బ తింటున్నాయని తెలిపారు. సినిమా చూసే ప్రేక్షకులకు టికెట్ రేట్లు ఎంత ఉన్నాయో అర్థం కావడం లేదని  బాలగోవిందరాజు అన్నారు. కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, టికెట్లు రేట్లు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని, దీని వల్ల థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతున్నారని  రామ్ ప్రసాద్ తెలిపారు.

విరాళాలతో రేవతి కుటుంబాన్ని ఆదుకుందాం

సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. బాలుడు  శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకురావాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం పత్రిక ప్రకటనలో పిలుపునిచ్చింది.