
హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇష్యూపై తెలుగు ఫిల్మ్ చాంబర్ స్పందించింది. ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని.. బెట్టింగ్ యాప్స్ సమాజానికి చెడు చేస్తుంటే సినీ సెలబ్రెటీలు వాటికి ప్రచారం చేయడం ముమ్మాటికి తప్పేనని పేర్కొంది. మా అసోసియేషన్‌కు లేఖ రాస్తామని.. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసే నటులపై చర్యలు కోరుతామని తెలిపింది. ఇండస్ట్రీకి చెందిన కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్నారని.. బెట్టింగ్ యాప్స్ అంశంపై మా అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని సూచించింది. యువత చెడిపోయేందుకు సినీ పరిశ్రమ కారణం కాకుడదని ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు గురించే డిస్కషన్ నడుస్తోంది. ఈ కేసు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను షేక్ చేస్తోంది. కాసుల కక్కుర్తికి ఆశపడి కొందరు యూట్యూబర్లు, ఇన్ఫ్లూయన్స్ర్లు, సినీ సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ ప్రజలను ఆకర్శిస్తున్నారు. సెలబ్రెటీల మాటలు నిజమేనని నమ్మి ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. కొందరు అప్పులు చేసి మరీ ఆన్ లైన్ బెట్టింగ్ పెట్టి లాస్ అవుతున్నారు.
దీంతో ఒకవైపు బెట్టింగ్ యాపుల్లో నష్టాలు.. మరోవైపు చేసిన అప్పులు తీర్చలేక ఏమో చేయాలో అర్థం కాక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్‌ను డబ్బుల కోసం ప్రమోట్ చేస్తోన్న సెలబ్రెటీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన పలువురు సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు. విజయ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణతీ, నిధి అగర్వాల్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరితో పాటు పలువురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.