
ఖైరతాబాద్, వెలుగు: ‘నూరేండ్ల నా ఊరు.. ఓయమ్మ నా పల్లె సీమ’ గేయకావ్యం ఆలాపన కోసం ఈ నెల 28న రవీంద్రభారతిలో గాయకుల ఎంపిక జరుగుతుందని ప్రముఖ కవి, సినీగేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ వాతావరణం, జీవితంపై సుమారు 25 ఏండ్ల పాటు పరిశోధన చేసి దానిని గేయ కావ్యంగా రూపొందించామని తెలిపారు. నాలుగు గంటల నిడివి ఉన్న ఈ గేయకావ్యాన్ని 243 మంది గాయకులు, ఇతర కోరస్ బృందం కలిపి ఆలపిస్తారన్నారు.
220 మంది నృత్యకారులు పాలుపంచుకుంటారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వరంగల్ శ్రీనివాస్ రచించిన, ఆలపించ గేయాలు ప్రతిఒక్కరిలో స్ఫూర్తి నింపాయన్నారు. పలు చిత్రాల్లో గేయ ఆయన రచనలు చేయడమే కాకుండా పాటలు పాడి అలరించారన్నారు. గ్రూప్- 2 పరీక్షల్లో నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం రచయిత ఎవరనే ప్రశ్న రావడం గొప్ప విషయమన్నారు. ఒకే వేదికపై 460 మంది గాయకులు నాలుగు గంటల పాటు గేయకావ్యాన్ని ఆలపించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, ఇది కచ్చితంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రజా గాయకుడు దరువు అంజన్న తదితరులు పాల్గొన్నారు.