- ఫోన్ల ద్వారా వచ్చిన ఆర్డర్లకే ఇసుక తయారీ
- డంపులపైనే దృష్టి పెడుతున్న ఆఫీపర్లు
- వాగులు, వ్యవసాయ పొలాల్లోని తయారీ కేంద్రాలపై నిఘా కరువు
మహబూబ్‌నగర్, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన ఫిల్టర్ ఇసుక తయారీపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ దందాను అరికట్టాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఫిల్టర్ ఇసుక తయారీదారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఫోన్లలో వచ్చే ఆర్డర్ల ప్రకారం కృత్రిమ ఇసుకను అప్పటికప్పుడు తయారు చేసి, ఆర్డర్ చేసిన వారి ఇండ్లకు నేరుగా పంపిస్తున్నారు.
ఈ సారి వ్యాపారులు పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల కండ్లు గప్పి రహస్యంగా కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారు. వాగులు, వంకలు, వ్యవసాయ పొలాలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ రూరల్ మండలం రామచంద్రాపూర్, కోటకదిర, మాచన్‌పల్లి, వెంకటాపూర్, హన్వాడ మండలం మునిమోక్షం, ఇబ్రహీంబాద్, చిర్మల్కుచర్తండా, జడ్చర్ల మండలం నసరుల్లాబాద్, పోలేపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు.
పోలీసుల తనిఖీలు ఎక్కువ కావడంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఐదున్నర గంటల వరకు మాత్రమే కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో తయారు చేసి స్టోర్ చేసుకుంటే పోలీసులతో సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఆర్డర్ వస్తేనే ఇసుక తయారుచేసి సప్లై చేయడం గమనార్హం. ట్రాక్టర్ ఇసుకకు రూ.3 వేల నుంచి రూ.3,500 అమ్ముతున్నారు. ఇక మండలం దాటి వెళ్తే పట్టుబడే అవకాశం ఉండడంతో మండలంలోని గ్రామాలకే సప్లై చేస్తున్నారు. అది కూడా ఉదయం 6 గంటల లోపు ఆర్డర్ ఇచ్చిన ఇంటికి ట్రాక్టర్లను పంపిస్తున్నారు.
యాసంగి సాగుకు కష్టం..
ఈ ఏడాది జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో యాసంగిలో బోర్ల ఆధారంగా పంటలు పండించుకుంటున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్ కూడా మొదలైంది. ఇప్పటికే రైతులు వరి తుకాలు పోసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామాలకు దగ్గరలో ఉన్న వాగులు, వంకల్లో కృత్రిమ ఇసుక తయారు చేస్తుండడంతో ఆ ఎఫెక్ట్ బోర్లపై పడుతోంది. ఈ దందా ఇలాగే సాగితే వచ్చే ఎండకాలం లోపే బోర్లు అడుగంటిపోయి సాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డంపులపైనే దృష్టి పెడుతున్రు..
ఫిల్టర్ ఇసుక దందాను ఆరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఇసుక డంపులను సీజ్ చేస్తున్నారు. కానీ, తెల్లవారుజామున కృత్రిమ ఇసుక తయారీ జరుగుతున్నా దానిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఉదయం పూట గ్రామాల గుండా యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఈ దందాపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు. వాగులు, వంకలు, వ్యవసాయ పొలాల వద్ద తనిఖీలు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
కంప్లైంట్ చేయలేదు..
ఫిల్టర్ ఇసుక తయారీకి సంబంధించి మాకు ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ఇటీవల రామచంద్రాపూర్ వద్ద కొందరు మట్టిని తరలిస్తున్నారని కంప్లైంట్ వస్తే ఆర్ఐ వెళ్లి పరిశీలించారు. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి వచ్చారు. ఫిల్టర్ ఇసుక తయారీకి సంబంధించిన సమాచారం ఇస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.
-
సుందర్ రాజన్, తహసీల్దార్, మహబూబ్‌నగర్ రూరల్
స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం..
ఫిల్టర్ ఇసుక తయారీని అరికట్టడానికి హన్వాడలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం. పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణాలకు ఇసుక అవసరమైన వారు పర్మిషన్ తీసుకొని డంప్ చేసుకుంటున్నారు. పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం.
-
కిష్ట్యానాయక్, తహసీల్దార్, హన్వాడ