వాగులు, పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు

  • యధేచ్చగా విద్యుత్ చౌర్యం.. మోటార్లు బిగించి ఇసుక తయారీ
  • దర్జాగా నగరానికి చేర్చి అమ్మకాలు

హనుమకొండ, వెలుగు: హనుమకొండ జిల్లాలో ఫిల్టర్​ ఇసుక దందా జోరుగా సాగుతోంది. రోజురోజుకు నిర్మాణాలు పెరిగిపోతుండటం.. అందుకు ఇసుక అవసరం పెరుగుతుండడంతో కొందరు అక్రమార్కులు దర్జాగా కృత్రిమ ఇసుకతో బిజినెస్​ చేస్తున్నారు. వాగులు, చెరువుల సమీపంలోని భూముల్లో పేరుకుపోయిన మట్టి ఇసుకను అక్రమంగా తవ్వడమే కాకుండా.. వ్యవసాయానికి ఇచ్చే ఫ్రీ కరెంట్​ తో మోటార్లు నడిపిస్తూ మట్టిని కడిగి  ఇసుకను తయారు చేస్తున్నారు. అనంతరం వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చేరవేస్తూ గోదావరి ఇసుక పేరు చెప్పి సొమ్ముచేసుకుంటున్నారు. వాల్టా యాక్ట్​ కు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా స్థానిక రెవెన్యూ, మైనింగ్​, ఎలక్ట్రిసిటీ, పోలీస్​ ఆఫీసర్లను మేనేజ్​ చేసుకుంటూ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీకి  చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఈ దందాలకు సహకరిస్తుండగా.. కొన్నిచోట్ల వారే అక్రమ బాగోతంలో భాగస్వాములుగా ఉండటం గమనార్హం.

వాగులు, సాగు భూములన్నీ ఖాళీ

ఆఫీసర్ల నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండానే జిల్లాలో వాగుల సమీపంలోని పొలాలు, బీడు భూముల్లో మట్టి ఇసుకను తోడుతున్నారు. అనంతరం వ్యవసాయ బావుల వద్ద డంప్​ చేసి.. ఫ్రీ కరెంట్ మోటార్లతో నీటిని తోడి దాన్నంతా శుభ్రం చేస్తున్నారు. మట్టి, ఒండ్రు ఇసుకను మేలైన ఇసుకగా మార్చి ఎక్కడికక్కడ డంపింగ్ చేస్తున్నారు. ఇలా తయారు చేసిన ఇసుకను కొంతమంది అక్కడే డంపింగ్​ చేసి అవసరం ఉన్న వారికి సప్లై చేస్తుండగా.. ఇంకొంతమంది సిటీలో డంప్​ చేస్తూ బిజినెస్​ చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్​ ట్రిప్పు ఇసుకకు గ్రామాల్లోనైతే  రూ.5 వేల నుంచి రూ.6 వేలు, పట్టణ ప్రాంతాలకైతే రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.

మెయిన్​ రోడ్డుపై దర్జాగా రవాణా..

అక్రమంగా సాగుతున్న ఫిల్టర్​ ఇసుక దందాకు ఆఫీసర్లు కూడా సపోర్ట్​ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతసాగర్ నుంచి మడికొండ, దేవన్నపేట రింగ్ రోడ్డు మీదుగా రోజూ తెల్లవారుజామున, సాయంత్రం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఫిల్టర్​ ఇసుకను సిటీకి చేరవేస్తున్నాయి. ధర్మసాగర్​ మండలం నుంచి వచ్చే వెహికిల్స్​ కూడా రింగ్​ రోడ్డు మీదుగానే రవాణా చేస్తుండగా.. ఆఫీసర్లు లైట్​ తీసుకుంటుండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇసుకను డంప్​ చేసి అమ్మడం కూడా నిబంధనలకు విరుద్ధమే అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఫిల్టర్​ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ, మైనింగ్​, ఎలక్ట్రిసిటీ, పోలీస్​ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలని, ఉన్నతాధికారులు కూడా ఈ దందాను నియంత్రించేందుకు చొరవ తీసుకోవాలని చెబుతున్నారు.

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని సర్వే నెంబర్ 73లోని 23 ఎకరాల ఈ భూమిని గత ప్రభుత్వాలు గ్రామానికి చెందిన 45 మంది నిరుపేదలకు అసైన్డ్​ చేశాయి. మండలకేంద్రానికి చెందిన ఓ ఇద్దరు టీఆర్ఎస్​ లీడర్లు ఆ భూమిని లీజ్​కు తీసుకుని తమ సొంత వెహికల్స్ తో దందా చేస్తున్నారు. 

గులాబీ లీడర్ల చేతుల్లోనే..

జిల్లాలోని హసన్​ పర్తి, ఎల్కతుర్తి, ధర్మసాగర్​, వేలేరు, భీమదేవరపల్లి మండలాల్లో ఫిల్టర్​ ఇసుక దందా జోరుగా నడుస్తుండగా.. ఐనవోలు, కమలాపూర్​ సహా మిగతా మండలాల్లో వాగుల నుంచి నేరుగా ఇసుక తీసి దందా చేస్తున్నారు. ఇదంతా గులాబీ లీడర్ల చేతుల్లోనే నడుస్తోందనే ఆరోపణలున్నాయి.

హసన్​ పర్తి మండలం అనంతసాగర్​ లో ఓ లేడీ ప్రజాప్రతినిధి భర్త, మండల స్థాయిలో కీలక పదవిలో ఉన్న మరో లీడర్​ ఇద్దరూ కలిసి దందా సాగిస్తున్నారు. ఇక ధర్మసాగర్​ మండలంలోని రాయగూడెం, తాటికాయల, పెద్దపెండ్యాల, ధర్మపురం గ్రామాల్లో కొందరు అధికార పార్టీ లీడర్లు, తమ అనుచరులతో కలిసి ఫిల్టర్​ ఇసుక బిజినెస్​ కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల మట్టిని బ్లాస్ట్​ చేసేందుకు పేలుడు పదార్థాలు వాడుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇదే మండలంలోని రాయగూడెంలో ఓ వ్యక్తి వాగు పక్కనే ఫిల్టర్​ ఇసుక తయారు చేసి.. దానిని లారీల్లో తరలించడానికి వాగుకు అడ్డంగా టెంపరరీ కాజ్​వే నిర్మించాడు. ఇసుకను పూర్తిగా రవాణా చేసిన తరువాత మళ్లీ ఆ మట్టిని తొలగించి వాగును క్లియర్​ చేస్తూ దందా సాగిస్తున్నాడు.