చివరి విడత ఎన్నికల్లో కాశీ వైపే చూపు

ఇప్పటివరకు ఆరు విడతలుగా జరిగిన  పోలింగ్‌‌‌‌తో 483 స్థానాల్లో ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. కీలకమైన ఏడో విడతకు మిగిలినవి 59 స్థానాలు మాత్రమే.  వీటిలో ప్రధాని మోడీ రెండోసారి పోటీ చేస్తున్న వారణాసి సీటుకూడా ఉంది. దీనితోపాటుగా మోడీతో విభేదించి కాంగ్రెస్‌‌‌‌లో చేరిన శత్రుఘ్న సిన్హా, బీజేపీలో అలా చేరి ఇలా సీటు తెచ్చుకున్న సన్నీ డియోల్‌‌‌‌, దళిత అగ్రనేత బాబూ జగ్జీవన్‌‌‌‌ రామ్‌‌‌‌ కుమార్తె మీరాకుమార్‌‌‌‌, మాటల తూటాలు పేలుస్తున్న క్యారెక్టర్‌‌‌‌ యాక్ట్రెస్‌‌‌‌ కిరణ్‌‌‌‌ ఖేర్‌‌‌‌లు పోటీ చేస్తున్న సీట్లున్నాయి. ఇవి కాకుండా ఏడుసార్లు నెగ్గినా ఏజ్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌తో సీటు దక్కని సుమిత్రా మహాజన్‌‌‌‌ సొంతూరు ఇండోర్‌‌‌‌లోనూ ఈ నెల 19నాడే పోలింగ్‌‌‌‌ జరగాల్సి ఉంది. మొత్తంమీద ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల పోలింగ్‌‌‌‌ ఒక ఎత్తు కాగా, చివరి విడత ఎన్నికలు ఒక ఎత్తుగా మారాయి.

ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి పోటీ చేస్తుండడంతో వారణాసి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక నగరంగా కాశీ పాపులర్. 2009లో బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 లో ఆయనను  కాన్పూర్‌‌‌‌కి పంపించి, నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి పోటీ చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌‌‌‌ అరవింద్ కేజ్రీవాల్‌‌‌‌పై 3.71 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కిందటిసారి పోటీచేసి ఓడిపోయిన అజయ్ రాయ్​కే కాంగ్రెస్‌‌‌‌ మళ్లీ టికెట్‌‌‌‌ ఇచ్చింది. ఒక దశలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ కాశీ బరిలో దిగుతారన్న ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. చివరకు అజయ్ రాయ్​నే కేండిడేట్‌‌‌‌గా కాంగ్రెస్ ఖరారు చేసింది. సమాజ్‌‌‌‌వాది పార్టీ అభ్యర్థిగా శాలినీ యాదవ్ పోటీ చేస్తున్నారు. తెలంగాణకు చెందిన 25 మంది పసుపు రైతులు తమ సమస్యను దేశం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో వారణాసిలో పోటీకి సిద్ధపడ్డారు. ప్రధాని మోడీపై 25 నామినేషన్లు వేసినా, చివరకు ఒక్కరు మాత్రమే బరిలో నిలబడ్డారు.  స్క్రూటినీలో 24 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఒక్క రైతు నామినేషనే  ఓకే అయ్యింది.  రైతులు గెలవాలన్న దృష్టితో కాకుండా, పసుపు రైతాంగ సమస్యలను దేశవ్యాప్తంగా హైలైట్‌‌‌‌ చేయాలన్న ఉద్దేశంతోనే నామినేషన్ల వరకు వెళ్లారు. ఈ విషయంలో పనుపు రైతులు సక్సెస్‌‌‌‌ అయినట్లే.

ముస్లింలు ఎటువైపు?

వారణాసి పరిధిలో మొత్తం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, వీటిలో రెండు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.  ఇక్కడి ఓటర్లు 17,67,486. వీరిలో మగ ఓటర్లు 9,86,224, ఆడ ఓటర్లు  7,81,262 మంది ఉన్నారు.  కాశీ క్షేత్రమంటే హిందువులకు అత్యంత భక్తి. నియోజకవర్గంలో జనాభా రీత్యా ముస్లింలు  దాదాపు మూడు లక్షల మంది, బ్రాహ్మణులు రెండున్నర లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కుర్మీలు (లక్షన్నర వరకు) , యాదవ, కాయస్థ, చౌరాసియా, భూమిహార్, దళితులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థి శాలినీ యాదవ్‌‌‌‌ బరిలో ఉండడంతో నియోజకవర్గంలోని యాదవ, ముస్లిం, దళిత ఓట్లు ఎటువైపు చీల్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.  వారణాసిలో స్వయానా ప్రధానమంత్రే పోటీ చేస్తున్నందువల్ల కాషాయదళం  ఓట్లు చీలకుండా గట్టిగా పనిచేస్తోంది.

‘విశ్వనాథ్‌‌‌‌ కారిడార్‌‌‌‌’ పనులతో అసంతృప్తి

‘విశ్వనాథ్‌‌‌‌ కారిడార్‌‌‌‌’ పేరుతో వారణాసిలో విస్తరణ పనులు సాగుతున్నాయి. ప్రపంచంలోనే ‘అత్యంత పురాతన సజీవ నగరంగా దీనికి గుర్తింపు ఉంది.. హిందువులకు చాలా పవిత్రమైనది. వేల ఏళ్ల క్రితం కట్టించిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. కాలక్రమేణా వాటి చుట్టూ ఇళ్లు, భవనాలు కట్టేశారు. కాశీకి ఫేస్‌‌‌‌లిఫ్ట్‌‌‌‌ చేయాలన్న ఉద్దేశంతో నగరంలో రోడ్ల విస్తరణ జరుగుతోంది.  గంగా నది నుంచి నగరంలోకిగల దారులన్నీ ఇరుకుగా ఉండడంతో వాటిని విస్తరిస్తున్నారు. కిక్కిరిసినట్టుండే వీధుల్లో ఇళ్లను, దుకాణాలను కూలగొడుతుంటే, పురాతన కట్టడాలు బయటపడుతున్నాయి. మోడీ తమ నగరానికి చేసిందేమీ లేకపోయినా, వారణాసి రూపురేఖల్ని చెరిపేస్తున్నారన్న అసంతృప్తి జనంలో ఉంది.

గంగలో కలిసిన ప్రక్షాళన

గంగా నది ప్రక్షాళన కోసం కేటాయించిన వేలాది కోట్ల రూపాయలు ఖజానాలోనే మూలుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం ‘క్లీన్‌‌‌‌ గంగ ఫండ్‌‌‌‌’లోని  నిధులపై 100 కోట్లకు పైగా వడ్డీ వచ్చిందని వాటర్‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌ మినిస్ట్రీ ఇటీవల తెలిపింది. నేషనల్‌‌‌‌ క్లీన్‌‌‌‌ గంగా మిషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఎంసీజీ)ని 2016లో ఆరంభించారు. జనం నుంచి రూ.266.94 కోట్లనుకూడా సేకరించారు. ఎన్‌‌‌‌ఎంసీజీ కింద 236 మెయిన్‌‌‌‌ ప్రాజెక్టులు, 114  మురుగు నీటి మళ్లింపు ప్రాజెక్టులు అమలు కావాలి. ఈ మూడేళ్లలో 27 మాత్రమే పూర్తయ్యాయి.  ఈ పనులన్నీ చురుగ్గా సాగినట్లయితే స్థానికంగా టూరిజం మరింత పెరిగేదని, ఉపాధి మెరుగయ్యేదని ప్రజలు ఆశించారు. కానీ, పనులు పూర్తి కాకపోవడంతో  అసంతృప్తితో ఉన్నారు.

పట్నా సాహిబ్

బీహార్‌‌‌‌లోని ఈ సీటు బీజేపీకి చాలా ప్రెస్టీజియస్‌‌‌‌. ఎందుకంటే ఇక్కడ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్‌‌‌‌ టికెట్‌‌‌‌పై పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు ఇదే సీటు నుంచి బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా నెగ్గారు. ఆ తర్వాత మోడీతో పడకపోవడంతో రెబెల్‌‌‌‌గా ముద్రపడి, సీటు దక్కే ఛాన్స్‌‌‌‌ లేకపోవడంతో కాంగ్రెస్‌‌‌‌లోకి ఫిరాయించారు.  లాలూ ప్రసాద్‌‌‌‌ యాదవ్‌‌‌‌కి బాగా సన్నిహితుడైన శత్రుఘ్న సిన్హా… ఆయన సలహాతోనే కాంగ్రెస్‌‌‌‌లో చేరి టికెట్‌‌‌‌ తెచ్చుకున్నారు. సిన్హాపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాషాయ పార్టీకి సేఫ్ సీట్‌‌‌‌గా పట్నా సాహిబ్‌‌‌‌ గుర్తింపు పొందింది. 1984 తర్వాత ఇక్కడ కాంగ్రెస్‌‌‌‌ నెగ్గలేదు.    ఇక్కడ కాయస్థ కులానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

గురుదాస్‌‌‌‌పూర్‌‌‌‌

పంజాబ్‌‌‌‌లోని గురుదాస్‌‌‌‌పూర్‌‌‌‌లో మరోసారి బాలీవుడ్‌‌‌‌ నటుడినే బీజేపీ పోటీకి దింపింది. ఇక్కడ నుంచి వినోద్‌‌‌‌ ఖన్నా నాలుగుసార్లు బీజేపీ తరఫున నెగ్గి, కేంద్ర మంత్రిగాకూడా పనిచేశారు. 2017లో ఆయన మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఈ సీటు బీజేపీ చేజారిపోయి, కాంగ్రెస్‌‌‌‌ ఖాతాలోకి వెళ్లింది. బలరాం జాఖడ్​ కుమారుడైన సిట్టింగ్‌‌‌‌ ఎంపీ సునీల్‌‌‌‌ జాఖడ్‌‌‌‌కే కాంగ్రెస్‌‌‌‌ మళ్లీ టికెట్‌‌‌‌ ఇచ్చింది. అయితే, బీజేపీ మాత్రం మరోసారి హిందీ నటుడిపైనే ఆధారపడి, ధర్మేంధ్ర కొడుకు సన్నీ డియోల్‌‌‌‌ని బరిలో దింపింది. సన్నీ 30 ఏళ్ల కెరీర్‌‌‌‌లో వేళ్లపై లెక్కపెట్టదగిన బ్లాక్‌‌‌‌ బస్టర్స్‌‌‌‌ తప్ప యావరేజ్‌‌‌‌ హిట్లు లేని నటుడు.. మరోమాటలో చెప్పాలంటే, వెటరన్‌‌‌‌ యాక్టర్‌‌‌‌గా మారిపోయారు. తండ్రి ధర్మేంద్ర, పినతల్లి హేమామాలినిల స్ఫూర్తితో సన్నీ డియోల్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చి, గురుదాస్‌‌‌‌పూర్‌‌‌‌ టికెట్‌‌‌‌ తెచ్చుకున్నారు. ఆయనకు నియోజకవర్గ పరిధిగానీ, సామాన్యుల సమస్యలపైగానీ అవగాహన లేదంటున్నారు.   సన్నీ డియోల్‌‌‌‌ తనది రాజకీయ కుటుంబమే అంటారు. వాజ్‌‌‌‌పేయి హయాంలో తన తండ్రి ధర్మేంద్ర బికనీర్‌‌‌‌ (రాజస్థాన్) నుంచి లోక్‌‌‌‌సభకు ఎన్నికైన విషయం గుర్తు చేస్తున్నారు. గురుదాస్‌‌‌‌పూర్‌‌‌‌ జిల్లా అంతా ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 15,00,337 కాగా, మగ ఓటర్లు 7,84,477, ఆడ ఓటర్లు 7,15,860 మంది ఉన్నారు.

ససారం

బీహార్‌‌‌‌లోని ఎస్సీ రిజర్వుడ్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ అయిన ససారం కి ఒక ప్రత్యేకత ఉంది. మాజీ డిప్యూటీ ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ ఇక్కడి నుంచి ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కూతురు మీరా కుమార్ ఇక్కడి నుంచే  రెండుసార్లు గెలిచి, లోక్‌‌‌‌సభకు తొలి మహిళా స్పీకర్‌‌‌‌గా పనిచేశారు. 2014 లో మోడీ ప్రభంజనం ససారం సెగ్మెంట్‌‌‌‌నీ తాకింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఛెడీ పాశ్వాన్​ గెలిచారు.

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మీరా కుమార్, సిట్టింగ్ ఎంపీ ఛెడీ పాశ్వాన్​ (బీజేపీ) మరోసారి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మీరా కుమార్‌‌‌‌ చుట్టమే తప్ప, స్థానికురాలు కాదని బీజేపీ లీడర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి చుట్టం చూపుగా మీరా వచ్చిపోతుంటారని, నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేసిందేమీ  లేదని ఆరోపిస్తున్నారు. మీరా కుమార్ మాత్రం  ససారం నియోజకవర్గానికి తన తండ్రితోపాటు తాను కూడా ఎన్నో పనులు చేశామని చెప్పుకుంటున్నారు. ససారం పరిధిలో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి.  ఉత్తరప్రదేశ్​ని ఆనుకుని ఉన్న ససారం సెగ్మెంట్ పరిధిలో  కొంత ప్రాంతం రెడ్ కారిడార్‌‌‌‌లో భాగంగా ఉంది. ‘బ్యాక్‌‌‌‌వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం’ కింద నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు అందుతాయి.

చండీగఢ్‌‌‌‌

కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌‌‌‌లోని ఒకే  ఒక్క నియోజకవర్గం ఇది. కేంద్ర పాలిత ప్రాంతం అంతా ఈసెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ కుమార్ బన్సాల్ 15 ఏళ్ల పాటు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. పోయిన ఎన్నికల్లో బీజేపీ టికెట్‌‌‌‌పై బాలీవుడ్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌ యాక్ట్రెస్‌‌‌‌ కిరణ్ ఖేర్ ఇక్కడ గెలిచారు. ఆమె మరోసారి ఇక్కడ పోటీలో ఉండగా, కాంగ్రెస్ తరఫున సీనియర్‌‌‌‌ ఎంపీ బన్సాల్ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఐదేళ్లపాటు ఖేర్‌‌‌‌ ఎంపీగాఉన్నా చండీగఢ్‌‌‌‌ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని బన్సాల్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఈ విమర్శలను ఖేర్ తిప్పికొట్టారు.15 ఏళ్ల పాటు ఎంపీ గా ఉన్న బన్సాల్ హయాం కంటే తన హయాంలోనే  సెగ్మెంట్ లో అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ నియోజకవర్గంలో  షెడ్యూల్డ్ కులాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సెగ్మెంట్‌‌‌‌లో లిటరసీ రేట్ కూడా ఎక్కువే. నియోజకవర్గంలో లిటరసీ రేటు 86 శాతం ఉండడంతో అభివృద్ధిపైనే ప్రచారం సాగుతోంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 6,15,214 కాగా, మగ ఓటర్లు 3,33,621, ఆడ ఓటర్లు 2,81,593 మంది ఉన్నారు.

ఇండోర్

మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఇండోర్ నియోజకవర్గానికి బీజేపీ కంచుకోటగా పేరుంది. లోక్‌‌‌‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇక్కడి నుంచి ఏడుసార్లు ఎన్నికయ్యారు. 1989 నుంచి ఇప్పటివరకు ఆమెకు తిరుగు లేదు. ఈసారి కూడా ఆమె టికెట్ ఆశించారుగానీ, వయసు 75 ఏళ్లు దాటినందున పార్టీ పాలసీ ప్రకారం టికెట్ దొరకలేదు.  ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా శంకర్ లాల్ వనీ, కాంగ్రెస్ టికెట్‌‌‌‌పై పంకజ్ సంఘ్వీ  పోటీ చేస్తున్నారు. ఇండోర్ నియోజకవర్గంలో పట్టణ ప్రాంతాలు ఎక్కువ. ‘లిటిల్ ముంబై’ అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్‌‌‌‌కి కమర్షియల్ హబ్‌‌‌‌గా ఇండోర్‌‌‌‌ గుర్తింపు పొందింది. మొత్తం ఓటర్లు 21,15,303. వీరిలో మగ ఓటర్లు 11,06,461, ఆడ ఓటర్లు 10,08,842 మంది ఉన్నారు.