నల్గొండ జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక కోసం ఫైనల్​ సర్వే

నల్గొండ జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక కోసం ఫైనల్​ సర్వే
  • ఎమ్మెల్యే లిస్ట్​ల ఆధారంగా పరిశీలన 
  • నేటి నుంచి గెజిటెడ్ ఆఫీసర్ల సర్వే  
  • ఉమ్మడి జిల్లాలో 43,971 అర్హులను గుర్తించిన ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేలు ఓకే చేసిన అర్హుల వెరిఫికేషన్

నల్గొండ, యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికే మంజూరు  చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇండ్ల కోసం అప్లికేషన్ చేసినవారిలో అర్హులైనవారిని ఎమ్మెల్యేలు గుర్తించినా... వారిలోనూ ఫిల్టర్ చేసి ఇండ్లు అత్యవసరమైన వారికే మంజూరు చేయడానికి ప్రభుత్వం మరోసారి సర్వే చేపట్టనుంది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజాపాలనలో అప్లికేషన్లు స్వీకరించింది. వీరిలో ఇండ్లు లేకున్నా.. స్థలాలు ఉన్న వారితోపాటు శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ఉంటున్న వారిని ఎల్​–-1లో చేర్చింది. ఇంటితోపాటు ఇంటి స్థలం లేనివారిని ఎల్-–2లో చేర్చింది. ఇండ్లు, వాహనాలు ఉన్నవారిని ఎల్–--3లో చేర్చారు. 

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..

ఈ ఏడాది జనవరి 26న ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని యూనిట్​గా తీసుకొని ఇండ్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా యాదాద్రి జిల్లాలో 758 ఇండ్లను శాంక్షన్​ చేయగా, 486 ఇండ్లు గ్రౌండింగ్​ అయి.. 83 ఇండ్ల బేస్మెంట్ నిర్మించారు. వీటిలో 45 ఇండ్లకు మొదటి విడతగా రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల అకౌంట్లలో జమ అయింది. నల్గొండలో 1904  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో 400 ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 4,479 ఇండ్లు మంజూరు చేయగా, వీటిలో 623 ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల 82 మందికి మొదట విడతగా అమౌంట్​రిలీజ్ ​అయింది. 

43,971 అర్హులను ఎంపిక 

ఎల్​–-1 జాబితాలోంచి ఎమ్మెల్యేలతో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేసింది. నల్గొండ పరిధిలో 21 వేలు, సూర్యాపేట పరిధిలో 14 వేలు, యాదాద్రి జిల్లాలో 8,971 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన జాబితా రూపొందించి కలెక్టర్లకు అందించారు. అయితే ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలో సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఎమ్మెల్యేలు ఓకే చేసిన జాబితాలోనూ నిరుపేద ​లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఈనెల 30లోపు సర్వే..

ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్ట్​ తీసుకొని మంగళవారం నుంచి రీ–సర్వే చేపడతారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన ఏఈలతో టీమ్స్​ రెడీ చేశారు. వీరు ఎల్​–-1 జాబితాలోని వ్యక్తి ఇంటికి వెళ్లి.. సొంతిల్లు అయితే.. అది ఏ పరిస్థితిలో ఉంది. కూలిపోయే స్థితిలో ఉందా..? మంచిగానే ఉందా..? అన్నది పరిశీలిస్తారు. ఒక్కో గెజిటెడ్​ ఆఫీసర్​కు కనీసం రెండు వందల మంది జాబితాను అప్పగిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 30లోపు సర్వే ముగించి, ఫైనల్​ జాబితా రూపొందించాల్సి ఉంటుంది. ఈ జాబితాను ఇన్​చార్జి మంత్రికి పంపించిన అనంతరం  మే 2న గ్రామ పంచాయతీల్లో అర్హుల జాబితాను ప్రదర్శించాలి. ఆ తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 

గెజిటెడ్​ ఆఫీసర్లతో సర్వే

ఎల్​–-1 జాబితాలోంచి ఎంపిక చేసిన అర్హుల జాబితాతో రీ –సర్వే చేపడుతున్నాం. యాదాద్రి జిల్లాలో 60 మంది గెజిటెడ్ ఆఫీసర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఒక్కొక్కరికి 150 అర్హుల జాబితాను అప్పగిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేస్తాం.

విజయ్​ సింగ్​, పీడీ, హౌసింగ్​, యాదాద్రి