ఎట్టకేలకు కదలిక ఫాతిమా నగర్​ కొత్త బ్రిడ్జి పనులకు మోక్షం

వరంగల్, వెలుగు: గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి, ఆతరువాత పట్టించుకోకపోవడంతో కాజీపేట ఫాతిమా నగర్​ బ్రిడ్జి పనులు ఆరేండ్లుగా పెండింగ్​లోనే ఉన్నాయి. ఈ బ్రిడ్జి ప్రాధాన్యతను గుర్తించిన కాంగ్రెస్  సర్కారు వచ్చే మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్​గా పెట్టి పనులను ప్రారంభించడంతో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ నుంచి ఓరుగల్లు కేంద్రానికి రావాలంటే ఫాతిమా నగర్​ బ్రిడ్జి ఒక్కటే ఆధారం. కాజీపేట రైల్వే జంక్షన్​ మీదుగా ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు రైళ్లు విడిపోయే క్రమంలో ఈ మూడింటిని కలిపేచోట.. జనాలు, వాహనాలు వెళ్లేందుకు ఐదారు దశాబ్దాల క్రితం నిర్మించిందే ఫాతిమా బ్రిడ్జి. నిత్యం లక్షలాది జనాలు, వాహనాలు దీని మీదుగా వెళ్తుంటాయి. 24 గంటలు రద్దీగానే ఉంటుంది. బ్రిడ్జిపై ఏదైనా ఒక వాహనం ఐదు నిమిషాలు ఆగిందంటే.. అటు కాజీపేట, ఇటు హనుమకొండ వైపు కిలోమీటర్ల దూరం ట్రాపిక్​ జామ్​ అవుతోంది. కాగా, ట్రై సిటీలో పెరిగిన ట్రాఫిక్​కు తోడు బ్రిడ్జికి సైతం అక్కడక్కడ పగుళ్లు వస్తుండడంతో దీనికి సమాంతరంగా మరో కొత్త బ్రిడ్జి ఆలోచన చేశారు. 

2018 జనరల్​ ఎలక్షన్​ వస్తుందనగా రూ.78 కోట్లతో కేసీఆర్​ సర్కార్​ పనులకు శంకుస్థాపన చేసింది. మూడేండ్లలో పనులు పూర్తి చేస్తామన్నారు. తీరా చూస్తే.. బీఆర్ఎస్​ ప్రభుత్వం రెండో టర్మ్​ పాలన పూర్తయినా కంప్లీట్​ చేయలేకపోయారు. బ్రిడ్జి ప్రాధాన్యతను అర్థం చేసుకున్న ప్రస్తుత కాంగ్రెస్​ సర్కార్​ పెండింగ్ లో ఉన్న ఫండ్స్​ ఇవ్వడానికి తోడు కావాల్సిన మెటీరియల్​ తెప్పించారు. దీంతో మిగిలిన పనులు పూర్తి చేసి వచ్చే మార్చి నెలలో దీనిని ప్రారంభించేందుకు అడుగులు పడుతున్నాయి.

870 మీటర్ల పొడవు.. 12 మీటర్ల వెడల్పు..

ఫాతిమా నగర్​ బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూరు చేస్తున్నట్లు 539 జీవో ఇచ్చింది. రూ.41 కోట్లు స్థల సేకరణ, కరెంట్, కేబుల్​తో పాటు 5.5 మీటర్ల సర్వీస్​ రోడ్డు నిర్మాణానికి ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మిగిలిన రూ.37 కోట్లతో 870 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో కాజీపేట ఫాతిమా నగర్​ రైల్వే లైన్​పై బ్రిడ్జి కోసం 2018లో శంకుస్థాపన చేశారు. కొత్త బ్రిడ్జి 2021 చివర్లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు.

ఫండ్స్  ఇవ్వక.. పర్మిషన్ లేక..

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్అండ్​బీ శాఖ ఈ పనులను పర్యవేక్షించింది. మూడేండ్ల కింద రైళ్లు నడిచే ట్రాక్​ వద్ద వరకు రెండు వైపులా పిల్లర్లు దానిపై స్లాబ్​ వేసిపెట్టింది. రెండు స్లాబులు కలిసేలా రైల్వే క్రాసింగ్​ ప్రాంతంలో రెగ్యులర్​ స్లాబ్​ కాకుండా.. ప్రీ ఫ్యాబ్రికేటెడ్​ స్లాబ్​ దిమ్మెలను వాడాల్సి ఉంది. దీని కోసం రైల్వేలోని రీసెర్చ్​ అండ్​ అనాలసిస్​ విభాగంలోని అధికారులు ఇక్కడి పనుల డిజైన్​ చూసి పర్మిషన్​ ఇవ్వాల్సి ఉంది. వారు అనుమతి ఇస్తే స్లాబ్​ వేయడానికి వీలుండే ప్రీ ఫ్యాబ్రికేటెడ్​ స్లాబ్​లను ఛత్తీస్​గడ్, కలకత్తా నుంచి తెప్పించాల్సి ఉంది. బ్రిడ్జి డిజైన్​ అనుమతి కోసం కేసీఆర్​ సర్కార్​ ఆశించిన స్థాయిలో చొరవ చూపలేదు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన రూ.18 కోట్లను బీఆర్ఎస్​ ప్రభుత్వం విడుదల చేయలేదు. రెండు, మూడు సార్లు కాంట్రాక్టర్లు మారారు. ఇక ఫండ్స్​ ఇవ్వక, రైల్వే అధికారుల అనుమతులు తేలక మూడేండ్లుగా స్లాబ్​ పడట్లేదు.

కాంగ్రెస్​ సర్కార్​ స్పెషల్​ ఫోకస్..

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రేటర్​ వరంగల్​ అభివృద్ధి పనులపై స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఇందులోభాగంగానే ఫాతిమా నగర్​ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని డిసైడ్​ అయింది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ కడియం కావ్యతో పాటు వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి బ్రిడ్జి విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పనులు మళ్లీ పట్టాలెక్కాయి. ఉమ్మడి వరంగల్​ ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి రైల్వే, ఆర్అండ్​బీ అధికారులు, కాంట్రాక్ట్​ సంస్థతో సమావేశం నిర్వహించారు. 

కాంట్రాక్ట్​ సంస్థకు రూ.11 కోట్ల నిధులు మంజూరు చేశారు. రైల్వే శాఖ అధికారులతో మాట్లాడారు.  రైల్వే లైన్​పై స్లాబ్​ వేయడానికి అవసరమైన ప్రీ ఫ్యాబ్రికేటెడ్​ దిమ్మెలను అధికారులు ఛత్తీస్​గడ్​ నుంచి తెప్పించారు. మరో 40 లారీల మెటీరియల్​ వారంలో  రానుంది. అయితే.. రైల్వే ట్రాక్​ పైభాగంలో దిమ్మెలతో స్లాబ్​ వేసే క్రమంలో కొన్ని గంటలు ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను ఆపడం లేదంటే వేరే మార్గానికి మళ్లించడమో చేయాల్సి ఉంటుంది. మొత్తంగా నయీంనగర్​ బ్రిడ్జిని జెట్​ స్పీడుతో 5 నెలల్లో నిర్మించిన తరహాలోనే..ఎక్కువ మంది సిబ్బంది, కార్మికుల సేవలను ఉపయోగించుకుని వచ్చే మార్చి నెల నాటికి ఫాతిమా నగర్​ కొత్త బ్రిడ్జి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు.