- మెదక్‌లో మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ క్లియరెన్స్
- జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం అనుసంధానం
- అందుబాటులోకి రానున్న స్పెషలిస్ట్ డాక్టర్లు
- మెరుగుపడనున్న వైద్య సేవలు
మెదక్, వెలుగు: ఎట్టకేలకు మెదక్‌లో మెడికల్ కాలేజీ మంజూరు అయింది. ఈ అకాడమిక్ఇయర్నుంచే మెడికల్ కాలేజీ ప్రారంభం కానుంది. పట్టణ శివారు పిల్లికొటాల్లోని పాత కలెక్టరేట్ బిల్డింగ్‌లో కాలేజీ నిర్వహణకు అనుగుణంగా మౌలిక వసతులు, మెడికల్ ఎక్విప్ మెంట్ సమకూర్చారు. ప్రిన్సిపల్ తో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ప్రొఫెసర్లు, అసోసియేట్ప్రొఫెసర్లు తదితర స్టాప్ 76 మంది జాయిన్ అయ్యారు.
ఈ సారి 50 మంది స్టూడెంట్స్‌కు ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సు చదివే అవకాశం లభించనుండటంతో పాటు, 130 బెడ్స్కెపాసిటీ గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి,100 బెడ్స్కెపాసిటీ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) లను, కొత్తగా నిర్మిస్తున్న 50 బెడ్స్ కెపాసిటీగల క్రిటికల్ కేర్ సెంటర్ ను మెడికల్ కాలేజీకి అనుసంధానించడం వల్ల అక్కడ వైద్య సౌకర్యాలు, సేవలు మెరుగుపడనున్నాయి.
ఇక 24 గంటలు వైద్య సేవలు
మెడికల్ కాలేజీకి అనుసంధానించడం వల్ల జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్‌లో 24 గంటల వైద్య సేవలు అందడంతో పాటు, వివిధ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి పరిస్థితి సీరియస్‌గా ఉన్న బాధితులను హైదరాబాద్ కు రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడి జిల్లా ఆసుపత్రిలోనే మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది.
టీచింగ్ హాస్పిటల్ లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీ ఎం ఈ) ద్వారా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనిక్, ఆర్థో, ఈఎన్టీ, ఆప్తమాలజీ, డెర్మటాలజీ డాక్టర్లు, రేడియాలజిస్టులు నియమితులవుతారు.బిల్డింగ్ లకు రూ.180 కోట్లు 2023లో అప్పటి ప్రభుత్వం మెదక్ మెడికల్ కాలేజీ, హాస్టల్ బిల్డింగ్ ల నిర్మాణం కోసం రూ.180 కోట్లు మంజూరు చేసింది.
ఈ మేరకు రెవెన్యూ అధికారులు పట్టణ శివారులోని ఎంసీహెచ్ ముందు భాగంలో మెదక్ - చేగుంట మెయిన్ రోడ్డు పక్కనే 14 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇపుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావడంతో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. నిర్మాణం పూర్తయితే ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు, ప్రొఫెసర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది.