
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలో సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన వైద్య కళాశాలలను బీజేపీ కట్టిందని చెబుతూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.
ఇటీవల దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించగా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. తాము కడుతున్న వాటిని లెక్కలో చూపిస్తూ.. బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు బండి సంజయ్ మెడికల్ కాలేజీలు తెచ్చామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఎయిమ్స్‌కే తట్టెడు మట్టి ఎత్తలేని వారు మెడికల్ కాలేజీలు తెచ్చామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రానికి 9 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందన్నారు. కేంద్రం విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.