- ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌లో మార్పులుంటాయనే వార్తలపై ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ వార్తలు కేవలం రూమర్లు మాత్రమేనని ఎక్స్‌లో పేర్కొన్నారు. అన్ని అసెట్ క్లాస్‌లపై ఒకేలాంటి ట్యాక్స్ సిస్టమ్ ఉండేలా ఐటీ డిపార్ట్‌మెంట్ ప్లాన్ చేస్తుందనే న్యూస్‌కు ఆమె స్పందించారు.
మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుత ట్యాక్స్ పాలసీలను మార్చాలని అనుకోవడం లేదని, మార్కెట్ కూడా అదే కోరుకుంటోందని నిర్మలా సీతారామన్ అన్నారు. పాలసీ కొనసాగింపు, నిలకడైన ప్రభుత్వాన్ని మార్కెట్ కోరుకుంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పై 10 శాతం లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ను వేస్తున్నారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.లక్ష కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఈ ట్యాక్స్ పడుతుంది.
లాభాలు రూ. లక్ష లోపు ఉంటే ట్యాక్స్ పడదు. ఇతర అసెట్‌లపై 20 శాతం లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధిస్తున్నారు. షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15 శాతం వేస్తున్నారు. ఈ అంశంపై నిర్మల క్లారిటీ ఇవ్వడంతో సోమవారం మార్కెట్ పెరుగుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.