
- ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.3 లక్షలనుంచి 5 లక్షలకు
- యూరియా సప్లై కోసం అస్సాంలో భారీ ప్లాంట్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం బలోపేతానికి కేంద్ర సర్కారు 6 కొత్త స్కీమ్స్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశమంతటా రైతులకు ఉత్పాదకత, సుస్థిరత, మార్కెట్ సౌలభ్యాన్ని పెంచడమే లక్ష్యంగా వీటిని అమలు చేయనున్నట్టు పేర్కొన్నది. వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్రం బడ్జెట్లో రూ. 1,71,437 కోట్లు కేటాయించింది. నిరుడికంటే (1,51, 851 కోట్లు) 19, 586 కోట్లు ఎక్కువగా కేటాయింపులు చేసింది. 2025–--26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలు వెల్లడించారు. దేశ వృద్ధికి వ్యవసాయాన్ని మొదటి ఇంజిన్అని పేర్కొన్నారు.
పీఎం కిసాన్ పథకానికి రూ.63,500 కోట్ల కేటాయింపులు చేసినట్టు తెలిపారు. విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్నిరకాల మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ‘‘పెట్టుబడి రుణసాయం, లోన్స్, కొత్త వంగడాల సృష్టి ఇలా అనేకరకాలుగా మద్దతు ఇస్తున్నామని, చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచామని వెల్లడించారు.
బిహార్‌లో మఖానా బోర్డు
బిహార్‌లో మఖానా (లోటస్సీడ్స్) బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బోర్డు ద్వారా ఫూల్ మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందిస్తారు. వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డ్ చూస్తుంది.
ఆక్వా కల్చర్ అభివృద్ధికి ఫ్రేమ్ వర్క్
ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్, సుదూర సముద్ర తీరాల్లో చేపల వేటకోసం ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెడుతున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ దీవులపై ఇది దృష్టిసారిస్తుందని చెప్పారు. ఇది అక్వా కల్చర్ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.
అస్సాంలో యూరియా ప్లాంట్
యూరియా సప్లై కోసం అస్సాంలో భారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీన్ని నామ్రూప్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడినుంచి ఏడాదికి 12.7 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దీనికి నేషనల్ కోఆపరేటివ్డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) సపోర్ట్ ఉంటుందని చెప్పారు.
1 ఉత్పత్తి పెంచేందుకు ‘ధన్‌ధాన్య కృషి యోజన’
వ్యవసాయ ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా ‘పీఎం ధన్‌ధాన్య కృషి యోజన’ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ స్కీమ్‌ను పంటల ఉత్పాదకత తక్కువగా కలిగిన 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రుణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలిగేలా స్కీమ్ రూపొందించినట్టు వివరించారు. రాష్ట్రాల సహకారంతో ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నట్టు తెలిపారు.
2ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా ఆర్ఎల్ఐ స్కీమ్
వ్యవసాయంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఆర్ఎల్ఐ)ను అమలు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. విజయవంతమైన పరిశోధనలు, వాటి అభివృద్ధి ఫలితాల కోసం ఈ స్కీమ్కింద ఆర్థిక ప్రోత్సాహకాలను అందించనున్నారు. అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకునే పంటల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ పథకం లక్ష్యం.
3పప్పు ధాన్యాల ఉత్పత్తికి ‘ఆత్మ నిర్భరత మిషన్’
పప్పు ధాన్యాల ఉత్పత్తికి ఆత్మ నిర్భరత మిషన్‌ను తీసుకొచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలెన్స్ ప్రొగ్రామ్’ కింద కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందు కోసం ఆరేండ్ల ప్రణాళికను అమలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువరైతులు, గ్రామీణ యువత, సన్న, చిన్నకారు రైతులు, భూమిలేని కుటుంబాలకు అవకాశాలను కల్పించి, వలసలను నివారించడమే లక్ష్యం. ఇందులో భాగంగా ఒప్పందం చేసుకున్న రిజిస్టర్డ్ రైతులనుంచి నాఫెడ్, ఎన్సీసీఎఫ్ నాలుగేండ్ల పాటు పప్పు ధాన్యాలను సేకరిస్తాయి.
4 అధికోత్పత్తి వంగడాలకు జాతీయ మిషన్
అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్‌ను ఏ ర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024 జూలై నుంచి ప్రవేశపెట్టిన 100 కంటే ఎక్కువ విత్తన రకాలను వాణిజ్యపరంగా విడుదల చేయాలనే యోచనతో అధిక-దిగుబడి, తెగులు -నిరోధకత, వాతావరణ పరిస్థితులను -తట్టుకునే విత్తనాల అభివృద్ధి, ప్రచారం కోసం కొత్త పరిశోధన పర్యావరణ వ్యవస్థపై మిషన్ దృష్టి సారిస్తుందని తెలిపారు.
5పత్తి ఉత్పత్తి పెంపు కోసం ప్రత్యేక మిషన్
పత్తి ఉద్పాతకతను పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఐదేండ్ల కాలంలో ఇది కాటన్ ప్రొడక్షన్‌ను మెరుగుపరచడంతోపాటు అదనపు పొడవైన ప్రధాన పత్తి రకాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. టెక్స్టైల్ సెక్టార్కోసం రూపొందించిన ఇంటిగ్రేటెడ్ 5ఎఫ్ విజన్‌కు ఇది ఊతమిస్తుందని పేర్కొన్నారు.
6పండ్లు, కూరగాయల సాగుకు కొత్త పథకం
పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. హార్టికల్చర్ సెక్టార్ అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని తెలిపారు. ఈ పథకాన్ని రైతు -ఉత్పత్తి సంస్థలు, సహకార సంఘాలను కలుపుకొని, రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేయనున్నట్టు చెప్పారు. వంట నూనెల్లో స్వయం సమృద్ధి కోసం ఎడిబుల్ ఆయిల్‌సీడ్ నేషనల్ మిషన్‌ను అమలు చేయనున్నట్టు తెలిపారు.
కిసాన్ క్రెడిట్‌కార్డు లిమిట్ పెంపు
రైతులకు రుణసౌకర్యం కల్పించే కిసాన్‌క్రెడిట్ కార్డు (కేసీసీ)ల రుణపరిమితిని కేంద్ర సర్కారు పెంచింది. ఇంతకుముందు రూ. 3 లక్షలుగా ఉన్న పరిమితిని రూ. 5లక్షలకు పెంచుతున్న ట్టు ప్రకటించింది. కేసీసీ రుణ పరిమితిని చాలాకాలంగా సవరించలేదు. ఈ పథకం కింద రైతులు 9% వడ్డీ రేటుతో రుణాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం 2% వడ్డీ రాయితీగా అందిస్తుంది.
దీనికి అదనంగా.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే రైతులు మరో 3% వరకు వడ్డీ రాయితీ పొందుతారు. అంటే వడ్డీ రేటు కేవలం 4 శాతంగా ఉంటుంది. కేసీసీ ద్వారా వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక రంగాల్లో రైతులు అవసరమైన పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చులకు స్వల్పకాలిక రుణం పొందొచ్చు. దీంతో 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.