
- ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు
- ఈ నెల 30న రిటైర్ కానున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన ఆయన.. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మే 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.
ఆర్థిక నిర్వహణలో ఎక్స్పర్ట్
సీనియర్ ఐఏఎస్ అయిన రామకృష్ణారావు ఆర్థిక నిర్వహణలో ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 13 బడ్జెట్లను ప్రవేశపెట్టడంలో, అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎఫ్ఎమ్ఐఎస్)ను ప్రవేశపెట్టారు.
రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల విభజన, పునర్వ్యవస్థీకరణ సమస్యలను సమర్థంగా నిర్వహించారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగానే కాకుండా.. ప్లానింగ్ శాఖలోనూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ జీఐఎస్ వ్యవస్థను బలోపేతం చేశారు.
గతంలో ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా.. ఆదిలాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. విద్య, ఆరోగ్య రంగాల్లోనూ ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. ఐఐటీ కాన్పూర్, ఢిల్లీలో డిగ్రీలు, అమెరికాలో ఎంబీఏ పూర్తిచేశారు. రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరి వరకు ఆయనకు కొనసాగింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్త: రామకృష్ణారావు
తనకు అప్పగించిన కీలక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని.. ప్రభుత్వ పథకాలను, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేస్తానని కొత్త సీఎస్ కె.రామకృష్ణారావు అన్నారు. ‘వెలుగు’తో ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో సీఎస్గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.