- కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారమంతా సర్కారుపైనే
- ఈ ఏడాది కడ్తున్న మిత్తే రూ. 6,519 కోట్లు
- కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు వెల్లడి
- కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ
- నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో లోన్ల స్వీకరణ
- ఇప్పుడు వాటిని తక్కువ
- వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరణ
హైదరాబాద్, వెలుగు:లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇన్నేండ్లలో ‘కాళేశ్వరం కార్పొరేషన్’కు వచ్చిన ఆమ్దానీ కేవలం రూ.7 కోట్లే! ఈ విషయాన్ని ఫైనాన్స్స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు మంగళవారం జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట ఓపెన్ కోర్టులో బయటపెట్టారు.
పేరుకే ఇది కాళేశ్వరం కార్పొరేషన్అని, కార్పొరేషన్ పేరుతో తెచ్చిన రుణభారమంతా ప్రభుత్వం నెత్తినే పడిందని పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం రుణాలన్నింటికీ ప్రభుత్వం షూరిటీగా ఉంటుంది.. అందుకు తగ్గట్టు కార్పొరేషన్‌కు లోన్లు ఇప్పించడంలో, తిరిగి చెల్లించడంలో సహకరిస్తుంది.. కార్పొరేషన్ తెచ్చిన లోన్లకు సంబంధించి నెలకు సగటున రూ.500 కోట్ల మేర ప్రభుత్వం వడ్డీలు కట్టాల్సి వస్తున్నది’’ అని వివరించారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-–25) అసలు రూ.7,382 కోట్లు కాగా.. వడ్డీ కింద మరో రూ. 6,519 కోట్లు చెల్లిస్తున్నదని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా నాడు 9 నుంచి 10.5 శాతం వడ్డీ రేటుతో రుణాలు తీసుకున్నామని, గత ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని తక్కువ వడ్డీ రుణాలుగా రీస్ట్రక్చర్ చేస్తున్నామన్నారు. మంగళవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణకు
రామకృష్ణారావు హాజరయ్యారు.
కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానలిచ్చారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చర్చించాకే ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు కేబినెట్ ముందుకు వెళ్లాయని చెప్పారు. విచారణకు సంబంధించిన వివరాలు..
కమిషన్: కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఆదాయ వనరులేంటి?
రామకృష్ణారావు: రెండు మార్గాల్లో కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుంది. ఒకటి: బడ్జెట్ కేటాయింపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బును సమకూరుస్తుంది. రెండు: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సమీకరిస్తుంది.
కమిషన్: కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరేలా, ప్రత్యేకమైన రెవెన్యూ వ్యవస్థ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 2015 అక్టోబర్ 6న జీవో 145ని జారీ చేశారు. దాని అర్థం ఏమిటి?
రామకృష్ణా రావు: పరిశ్రమలకు నీటిని అమ్మడం, తాగునీటి సరఫరా ద్వారా వచ్చే డబ్బుతో ఆదాయం సృష్టించడం దాని ఉద్దేశం. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్టు స్పాట్‌గా అభివృద్ధి చేసి ఆదాయాన్ని రాబట్టడం ఈ జీవో ఉద్దేశం.
కమిషన్: ఇప్పటిదాకా కార్పొరేషన్‌కు ఆదాయం ఏమైనా వచ్చిందా? వస్తే ఎంత వచ్చింది?
రామకృష్ణారావు: పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడం ద్వారా కార్పొరేషన్‌కు రూ.7 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
కమిషన్: రుణాల ద్వారా ఆదాయం సమకూరే వరకు కార్పొరేషన్ నిర్వహణ కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం సమకూరుస్తుందని జీవో 145లో పేర్కొన్నారు కదా? కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యం ఏమిటి?
రామకృష్ణా రావు: ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు కార్పొరేషన్‌కు రుణాల ద్వారానే నిధులు సమకూర్చుకునేలా అవకాశం కల్పించారు. అయితే, ప్రాజెక్టు పూర్తయి పరిశ్రమలకు నీటిని విక్రయించడం లేదా ఇతర మార్గాల్లో ఆదాయం సమకూరేందుకు సమయం పడుతుంది కాబట్టి కార్పస్ ఫండ్ ఇచ్చారు. రెవెన్యూ జనరేట్ అయ్యేదాకా ప్రభుత్వం ఇచ్చిన రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌ను వినియోగించుకునేందుకు కార్పొరేషన్‌కు స్వేచ్ఛ ఇచ్చారు. తద్వారా కార్పొరేషన్ నిర్వహణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఖర్చులకు ఆ డబ్బును వాడుకునేలా వీలు కల్పించారు.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్‌కు ప్రాజెక్టు నిర్వహణ, నిర్ణయాధికారం, అమలు, రుణాల ద్వారా వచ్చిన డబ్బు వినియోగం వంటి విషయాల్లో స్వేచ్ఛనిచ్చారా? కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించేలా ప్రభుత్వం, కార్పొరేషన్‌కు మధ్య ఒప్పందం జరిగిందా?
రామకృష్ణా రావు: ఔను. నిర్ణయాధికారాల్లో కార్పొరేషన్‌కు స్వేచ్ఛనిచ్చారు. ప్రభుత్వం వడ్డీ చెల్లించేలా ఒప్పందం జరిగింది.
కమిషన్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేయడంలో ఆర్థిక శాఖ పాత్ర ఏమిటి? ఏ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకుని అనుమతులు జారీ చేశారు?
రామకృష్ణా రావు: పరిపాలనా అనుమతులు ఇవ్వడానికి రెండు అంశాలను ఆర్థిక శాఖ పరిగణనలోకి
తీసుకుంటుంది. ఒకటి.. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే వచ్చే లాభం (కాస్ట్ బెనిఫిట్ రేషియో). రెండోది.. బడ్జెట్, ఇతర సోర్సుల ద్వారా ప్రాజెక్టుకు అందుబాటులో సరిపడా నిధులున్నాయో లేదో చూసుకోవాలి.
కమిషన్: ఆ బ్యారేజీలకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేయడానికి ముందు ఆర్థిక మంత్రి నుంచి డిపార్ట్మెంట్ ఆమోదం పొందిందా?
రామకృష్ణా రావు: నిర్మాణ దశలో ఉన్న ఏ ప్రాజెక్టుకైనా దానికి సంబంధించిన ఖర్చు విషయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ప్రతిపాదనలు వస్తాయి. ఆ తర్వాతే వాటికి ఆమోదం తెలుపుతారు.
కమిషన్: బ్యారేజీల నిర్మాణం, వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు చర్చించేలా 2016 నవంబర్ 3న జీవో 2412 ప్రకారం ఓ కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. బ్యారేజీల నిర్మాణం మొదలైనప్పటి నుంచి అవి పూర్తయ్యేవరకు దానికి సంబంధించిన వివరాలను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కుగానీ.. ప్రభుత్వానికిగానీ నివేదించిందా?
రామకృష్ణారావు: ప్రాజెక్టుల నిర్మాణ పురోగతికి సంబంధించి కోర్ కమిటీ ఎప్పటికప్పుడు వివరాలు ఇచ్చిందనడానికి రికార్డుల్లేవు.
కమిషన్: ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ కాళేశ్వరం కార్పొరేషన్ బ్యాలెన్స్ షీట్గానీ, అకౌంట్ షీట్గానీ సబ్మిట్ చేసిందా?
రామకృష్ణారావు: నాకు తెలిసినంత వరకు కార్పొరేషన్ వాటిని తయారు చేసింది. అయితే, ఆ డాక్యుమెంట్లు మాత్రం నా దగ్గరకు రాలేదు.
కమిషన్: తెలంగాణ ఆర్థిక జవాబుదారీతనం, బడ్జెట్నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 5 ప్రకారం అసెంబ్లీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఫిస్కల్ పాలసీని ప్రవేశపెట్టిందా? వాటితో పాటు మూడు బ్యారేజీలకు సంబంధించిన ఫిస్కల్ పాలసీని సభ ముందుకు తీసుకొచ్చిందా?
రామకృష్ణారావు: రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ప్రతి స్టేట్మెంట్ను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టింది. అందుకు తగ్గట్టు చర్యలూ తీసుకున్నది. మూడు బ్యారేజీల స్టేట్మెంట్లనూ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే, బ్యారేజీల్లో ప్రత్యేకంగా ఏ విషయానికి సంబంధించి స్టేట్మెంట్లు ప్రవేశపెట్టారన్నది మాత్రం సరిగ్గా గుర్తుకులేదు.
కమిషన్: కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ (బడ్జెట్లో లేని రుణాలు)ను రాష్ట్ర బడ్జెట్లో చూపించలేదని రికార్డులను బట్టి చూస్తే అర్థమవుతున్నది. కాగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే దీనిపై కొన్ని ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. 2021–22లో రూ.35,257.97 కోట్లు, 2022–23లో 9596.50 కోట్లు, 2023–24లో రూ.2545.98 కోట్ల చొప్పున బడ్జెటేతర ఖర్చుల కింద పేర్కొన్నారు. కానీ, కార్పొరేషన్ తీసుకున్న రుణాల అసలు, వడ్డీ చెల్లింపులను మాత్రం స్టేట్ బడ్జెట్లో చూపించారు. అందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2021–22లో రూ.30,922 కోట్లు, 2022–23లో 7199.81 కోట్లను బడ్జెటేతర రుణాలుగా కేంద్రానికి సమర్పించిన వివరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ, అంతకుముందు మాత్రం ఇవ్వలేదు.. ఎందుకు?
రామకృష్ణారావు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కార్పొరేషన్లు లేదా స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాల వివరాలను ఇవ్వాల్సిందిగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందికే వస్తాయని నాడు కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే కార్పొరేషన్లు లేదా ఎస్పీవీల ద్వారా తీసుకున్న రుణాల వివరాలను కేంద్రానికి సమర్పించాం.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్‌కు సంబంధించిన రుణాలను ప్రభుత్వం డిశ్చార్జ్ చేయాల్సి వచ్చే సందర్భంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి?
రామకృష్ణారావు: ఆ లోన్లకు ప్రభుత్వం కేవలం గ్యారంటర్గానే ఉంటుంది. లోన్లు ఇప్పించేందుకు సహకారం ఇస్తుంది.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ప్రభుత్వం కడుతున్న వడ్డీ ఎంత? అసలెంత?
రామకృష్ణా రావు: 2024–25 ఆర్థిక సంవత్సరానికిగానూ కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వం రూ.6,519 కోట్లను వడ్డీల రూపంలో కడుతున్నది. అసలు కింద రూ.7,382 కోట్లు కట్టాలి. రుణాల అసలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కొంత మారుతుంటుంది. వడ్డీ రేటు 9 నుంచి 10.5 శాతం వరకు ఉంది. అప్పుల భారం తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఆ లోన్లను రీస్ట్రక్చర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. గతంలో ఈ ప్రయత్నాలు జరగలేదు.