నిర్మాతలకు ‘కాసుల’ కష్టాలు

నిర్మాతలకు ‘కాసుల’ కష్టాలు

సినిమా నిర్మాణం అంటే మాటలు కాదు.చాలా కష్టమైన పని.డబ్బులతో కూడుకున్నవ్యవహారం. కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ప్రతి రోజు డబ్బులు పెట్టాల్సిందే.అంతే కాదు..ప్రమోషన్ కు కూడా ఖర్చు పెట్టాలి.రిలీజైన తర్వాత కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ఇదొక బిజినెస్.లాభమొచ్చినా,నష్టమొచ్చినా నిర్మాతదే బాధ్యత. తీరా అంతా చేస్తే..రిలీజ్ టైమ్ కి కొన్ని సినిమాలకు ఫైనాన్స్ కష్టాలు వచ్చి పడతాయి. ఇలా జరిగి ఇటీవల ఆగిపోయిన  కొన్ని సినిమాలపై ఓ లుక్ వేద్దాం..

శేఖర్ సినిమాకు సంబంధించి..

ఇటీవల ఫైనాన్స్ సమస్యల వల్లే రాజశేఖర్ నటించిన ‘‘శేఖర్ ’’ సినిమా ఆగిపోయింది. జీవిత తీసిన పాత సినిమా ‘‘మహంకాళి’’కి ఉన్న అప్పుల వల్లే ఆ ఫైనాన్షియర్ ‘శేఖర్’ సినిమాపై కేసు వేశాడు. రూ.65 లక్షలు చెల్లిస్తే కానీ సినిమాను రిలీజ్ చేసేందుకు అనుమతి లేదని స్టే తెచ్చుకున్నాడు.కానీ నిర్మాత మాత్రం సర్వీస్ ప్రొవైడర్ల వల్లే తనకు నష్టం జరిగిందంటూ ప్రెస్ మీట్ పెట్టాడు. దీని గురించి ‘శేఖర్’ మూవీ నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ రాజశేఖర్ వాళ్ల ఫ్యామిలీ ఈ సినిమా కోసం కష్టపడ్డారని కృతజ్ణత తో నేను వాళ్ల పేర్లు టైటిల్స్ లో వేశాను. కానీ వాళ్ల పాత అప్పు కారణంగా నా సినిమాను కిల్ చేశారు.కానీ కోర్టు ఎలాంటి ఆర్డరు ఇవ్వకుండానే, డిజటల్ ప్రొవైడర్లు సినిమాను ఆపేశారు. వాళ్ల ప్రాబ్లమ్ ఏంటో తెలియదు,వాళ్లకు మేము డబ్బులు కూడా చెల్లించాం.అయినా ఆపేశారు. డిజిటల్ ప్రొవైడర్ల మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. దాదాపు నేను రూ.15 కోట్లు నష్టపోయాను.ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ చేసే పరిస్థితి లేదు’’ అని వాపోయారు. ఇదే అంశం గురించి ఓ నిర్మాత మాట్లాడుతూ.. ‘‘నిర్మాత అంటే ఓ వ్యాపారి.సినిమాతో బిజినెస్ చేస్తుంటాడు.ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేస్తుంటాడు కాబట్టి డబ్బులు రొటేషన్ చేస్తుంటాడు.అందువల్ల ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటాడు. అయితే ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే రిలీజ్ కు కష్టం అవుతుంది.ప్రతిదానికి ప్లానింగ్ ఉండాలి. సినిమా ఖర్చు విషయంలో పకడ్బందీగా ఉండాలి. అలాగే రెమ్యునరేషన్ల మీద,ప్రొడక్షన్ కాస్ట్ పై అవగాహన ఉండాలి. అన్నీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే సేఫ్ అవుతాడు. లేదంటే రిలీజ్ అగిపోయే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ గా జరిగిన పరిణామాలు అలాంటివే’’అని చెప్పుకొచ్చారు. 

గతంలోనూ.. 

‘శేఖర్’ మూవీలాగే ఇదివరకు చాలా సినిమాలు రిలీజ్ కష్టాలను చవిచూశాయి. ఇటీవల రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా కూడా అంతే.ఫైనాన్షియర్ కు డబ్బులు కట్టలేదని రిలీజ్ కు పర్మిషన్ ఇవ్వలేదు.ప్రొడ్యూసర్ మళ్లీ అప్పటికప్పుడు ఫైనాన్షియర్ కు డబ్బులు కడితే సినిమా విడుదలైంది. నిర్మాత బెల్లంకొండకు చెందిన కొన్ని సినిమాలు కూడా ఇలాగే రిలీజ్ కష్టాలు ఎదుర్కొన్నాయి. ఆయన నిర్మించిన ముని, గంగ, రభస లాంటి సినిమాలకు ఏదో ఒక సమస్య ఎదురైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ‘‘హరిహర వీరమల్లు’’ సినిమాకు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటి కారణంగా ఇప్పటికే  దీని షూటింగ్ లోనూ జాప్యం జరిగింది. కరోనా సంక్షోభ కారణాల వల్ల చిత్ర నిర్మాణ ప్రక్రియ మరీ ఆలస్యమైంది. నిర్మాత పరిస్థితి ముందునుంచీ అంతంతే కాబట్టి.. ఇప్పుడు ఆయనపై వడ్డీల మీద వడ్డీలు పడుతున్నాయని టాక్. విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి పెద్దగా రిలీజ్ కష్టాలు ఉండకపోవచ్చని అంటున్నారు. 

రామ్ గోపాల్ వర్మ కూడా.. 

రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నాడు. రిలీజ్ కావాల్సిన ఆయన సినిమాలు బోలెడు ఉన్నాయి. ఆ సినిమాల మీదున్న ఫైనాన్స్ గురించి ఏదో ఒకటి ఎప్పుడూ న్యూస్ లో వినిపిస్తుంటుంది. ఇటీవల ఆయన తీసిన ‘లెస్బియన్’ సినిమా రిలీజ్ మీద ఇప్పటికే రెండు సార్లు స్టే లు వచ్చాయి. తాను తీసిన సినిమాలన్నింటికి అప్పులు ఉన్నాయని నిర్మాత నట్టికుమార్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. తాజాగా ‘‘దిశ’’ సినిమా తీస్తున్న టైమ్ లో తన దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ శేఖర్ రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది.  వైజాగ్ కు చెందిన ఒక  డిస్ట్రిబ్యూటర్ కు కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైమ్ లో సినిమా ఇస్తానని డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఒక్కొక్కరు బయటకు వచ్చేలా కనిపిస్తోంది.ఇలా ప్రతీ సినిమాకు ఎంతో కొంత ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంటుంది.సినిమాను తీయడం ఎంత కష్టమో.. దాన్ని అమ్ముకొని లాభాలతో బయటపడటం కూడా అంతే కష్టం.కానీ కొందరు నిర్మాతలు క్లారిటీ లేకుండా ఖర్చు పెట్టి తమ చేయిదాటిపోయేలా చేసుకుంటున్నారు. రిలీజ్ వరకు బాగా కష్టపడి.. సరిగ్గా విడుదల సమయానికి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.సరైన ప్లానింగ్ తో సినిమాలు నిర్మిస్తే..నిర్మాత సేఫ్ గా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాడు.

మరిన్ని వార్తలు..

మాఫియా చేతిలో 7 బుల్లెట్లు.. ఇప్పుడాయనే ‘సివిల్స్’ అధికారి !!

సడెన్ గా హార్ట్ ఎటాక్... ఎందుకొస్తుందంటే ?