
- దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యోగులు
- దగ్గర పడుతున్న బీసీలకు ఆర్థిక సాయం స్కీమ్ గడువు
- తహసీల్దార్ ఆఫీస్ ల చుట్టూ పరుగులు
- పట్టింపు లేని ఆఫీసర్లు
జనగామ, వెలుగు : సర్కారు చెప్పేదొకటి చేసేదొకటి అన్న చందంగా వ్యవహరిస్తోంది. అట్టహాసంగా ప్రకటించిన బీసీలకు లక్ష ఆర్థిక సాయం స్కీమ్ దరఖాస్తు కోసం జనాలకు గోస తప్పడం లేదు. ఈనెల 20 వరకే గడువు పెట్టగా ఆలోపు అప్లై చేసుకోవడం కష్టంగా మారింది. దరఖాస్తుదారులకు అవసరమైన సర్టిఫికెట్ల ఆందజేతలో రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉద్యోగులంతా సర్కారీ దశాబ్ది ఉత్సవాల్లో తీరిక లేకుండా గడుపుతుండడంతో అప్లికేషన్లు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉంటున్నాయి. ఎప్పటికప్పడు క్లియర్ చేయని కారణంగా రోజురోజుకూ పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య పెరిగిపోతోంది. జిల్లాలోే 12 వేల పైచిలుకు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో దరఖాస్తుదారులు తహసీల్దార్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు.
ఎక్కడివక్కడే
సర్కారు ఇటీవల ప్రకటించిన బీసీ బంధు పథకంతో పాటు విద్యా సంవవత్సరం ఆరంభం కావడంతో సర్టిఫికెట్ల కోసం మీసేవా సెంటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. కులం, ఆదాయం, నివాసం వంటి సర్టిఫికెట్లను తెచ్చుకునేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. మీసేవలో అప్లై చేసుకున్నా తహశీల్దార్ ఆఫీస్ లకు వెళ్లి క్లియర్ చేసుకుంటే తప్ప మోక్షం కలుగడం లేదు. జాప్యంపై ఎవరైనా అడిగితే ఎండలో తిరుగుతున్నం.. ఉత్సవాల కార్యక్రమాలు చేపడుతున్నామంటూ రెవిన్యూ స్టాఫ్ సమాధానాలు ఇస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బీసీ ఆర్థిక సాయ దరఖాస్తుకు ఈనెల 20 వరకే గడువు ఉండడంతో టెన్షన్ పడుతున్నారు.
జిల్లాలో 12 వేల అప్లికేషన్లు పెండింగ్
జిల్లాలో 12 మండలాలు ఉండగా సోమవారం వరకు 12,237 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. బీసీ ఆర్థిక సాయం కోసం పెద్ద సంఖ్యలో అప్లై చేసుకుంటుండడంతో ఈ సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. కాగా 26 రకాల సర్టిఫెకెట్లను రెవెన్యూ ఆఫీసర్లు అందిస్తుండగా అందులో ప్రధానంగా కులం, ఆదాయం, నివాసం, మ్యుటేషన్ వంటి వాటికి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. వీటి కోసం ఆఫీసర్ల పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న వారు తహసీల్దార్ ఆఫీస్‌ల కు చేరుకుని స్టాఫ్‌ను నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే సర్కారుకు ఇన్ కం తెచ్చి పెట్టే రిజిస్ర్టేషన్ల విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించారు. సర్టిఫికెట్లకు సంబంధించి మాత్రం సరైన పర్యవేక్షణ కరువైంది. జిల్లాలోని జఫర్గడ్, రఘనాథపల్లి, చిల్పూరు, స్టేషన్ ఘన్పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, నర్మెట, తరిగొప్పుల, జనగామ, లింగాల ఘన్పూర్ మండలాల్లో మొత్తంగా 12, 237 సర్టిఫికెట్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 5,879 ఇన్‌కం అప్లికేషన్లు, 4,867 కులం, బర్త్ అప్లికేషన్లు, 1,491 నివాస సర్టిఫికెట్ల అప్లికేషన్ లు పెండింగ్ లో ఉన్నాయి.
బీసీ బంధు గడువు పెంచాలె
బీసీ ఆర్థిక సాయం పథకం గడుపు పెంచాలె. అప్లై చేసుకునేందుకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసినం. అవి ఇచ్చేందుకు వారం పడుతుంది అంటున్నరు. ఈలోగా గడువు అయిపోతది. సర్టిఫికెట్లు ఇవ్వడంలో అధికారులు లేట్ చేస్తే మేం నష్టపోవాలా..? అధికారులు దశాబ్ది ఉత్సవాలలో బిజీగా ఉన్నం అంటున్నరు. సర్టిఫికెట్స్ త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలె.
రామగిరి నవీన్ కుమార్, గబ్బెట, రఘునాథపల్లి మండలం
కూలీ పని వదులుకొని వచ్చిన
బీసీ ఆర్థిక సాయం అప్లికేషన్‌కు క్యాస్ట్, ఇన్‌కం, నివాసం సర్టిఫికెట్లు కావాలంటే మీసేవలో దరఖాస్తు చేసిన. అప్లికేషన్లు తెచ్చి తహశీల్దార్ ఆఫీస్‌ల ఇచ్చిన. కూలీ పనులు వదులుకుని 3 రోజులుగా స్టేషన్ ఘనపూర్ కు వస్తున్న. ఇవ్వాళ ఉదయం 9.30 గంటలకే అఫీస్ కు వచ్చిన. సర్టిఫికెట్లపై ఆఫీసర్లు సంతకాలు పెట్టలేదని బయట కూర్చొమ్మని చెప్పిన్రు. ఇబ్బంది అయితాంది.
ఓర్సు వెంకటేశ్, మీదికొండ, స్టేషన్ ఘన్పూర్ మండలం