అంగీకరించిన జీ జిన్ పింగ్
బీజింగ్: చైనాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుపై మాట్లాడారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. జీ జిన్‌పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
అయినప్పటికీ పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా చైనా మాంద్యంతో పోరాడుతోంది. జీ జిన్‌పింగ్ తన టెలివిజన్ ప్రసంగంలో కొన్ని వ్యాపారరంగాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని, జనం ఉద్యోగాలు దొరక్క, కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.