పాకిస్థాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఎప్పుడో ఏడాది దాటింది. టీం సభ్యులందర్నీ సమానంగా చూడాల్సిన కెప్టెన్ ఒకరిద్దరినే ఎంకరేజ్ చేస్తే మ్యాచ్ రిజల్ట్ రివర్స్ అవుతుంది. పీఎంగా ఇమ్రాన్‌ఖాన్ ఇదే చేస్తున్నట్లనిపిస్తోంది. బడ్జెట్లో ఆర్మీకి, ఉన్నత వర్గాలకే పెద్ద పీట వేస్తుండటం వల్ల ఎకానమీ ఆందోళనకరంగా తయారైంది. పెనం మీద నుంచి పొయిలో పడేట్లు ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే బాకీల్లో నిండా మునిగిపోయే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
మన పక్క దేశమైన పాకిస్థాన్‌లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఫైనాన్షియల్ ఇండికేటర్లన్నీ నేల చూపులు చూస్తున్నాయి. గ్రోత్ రేట్ ఇప్పటికే సగానికి సగం తగ్గింది. 6.2 శాతం నుంచి 3.3కి పడిపోయింది. వచ్చే ఏడాది నాటికి ఇంకా బక్క చిక్కి 2.4 శాతానికి దిగజారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు. అదే జరిగితే గడచిన పదేళ్లలో ఇంతకన్నా తక్కువ వృద్ధి రేటు మరొకటి ఉండదని చెబుతున్నారు.
2019–20 ఆర్థిక సంవత్సరం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాక పాకిస్థాన్ రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే ఐదో వంతు కోల్పోయింది. రానున్న 12 నెలల్లో ఇన్ఫ్లేషన్ ఏకంగా 13 శాతానికి చేరే ఛాన్స్‌లు పుష్కలంగా ఉన్నాయి. గత పదేళ్లలో ఇదే మేగ్జిమం కానుంది. అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఏటా బడ్జెట్లో సుమారు 30 శాతం నిధులను రుణాలు తీర్చటానికి, వాటికి వడ్డీలు కట్టడానికే కేటాయించాల్సి వస్తోంది. పాత అప్పుల రీపేమెంట్ల కోసం కొత్త లోన్ల బాట పట్టాల్సి వస్తోంది.
ఆర్థిక సాయం 22వ సారి
ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్) 12 బిలియన్ డాలర్లకు చేరటంతో రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (ఐఎంఎఫ్) వద్ద 6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం (బెయిలౌట్) తీసుకుంది. పాకిస్థాన్ ఐఎంఎఫ్ వద్దకు బెయిలౌట్ కోసం వెళ్లటం ఇది 22వ సారి. ఆ దేశ ఎకానమీ 60 ఏళ్లలో 13 సార్లు కుప్పకూలింది. పతనమైన ప్రతిసారీ ఐఎంఎఫ్ అండతోనే గట్టెక్కింది. దేశం ఎందుకింత క్లిష్ట పరిస్థితుల్లోకి కూరుకుపోయిందో తెలుసుకోవటానికి స్పెషల్ కమిషన్ వేస్తానని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆమధ్య అన్నారు. అయితే, ఆయన ఇలాంటి ప్రయత్నాలేవీ చేయాల్సిన అవసరం లేదని, తన ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను, అంతకుముందు రిలీజ్ చేసిన ఆర్థిక సర్వేని చూస్తే తెలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు సమస్య ఎక్కడుందో ఆ రెండే చెబుతున్నాయని అంటున్నారు. రాబడి మార్గాలు తక్కువగా ఉండటం, నాన్–డెవలప్మెంట్ ఖర్చులు భారీగా పెరగటం వల్లే ఎకానమీ దివాలా తీసిందని వివరిస్తున్నారు. ట్యాక్స్ కలెక్షన్ పక్కాగా జరిగేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి కొన్నేళ్లుగా కొనసాగుతోంది.
పన్నులు ఎగ్గొట్టే సంపన్నులకే పదవులు!
పాకిస్థాన్‌లో పన్నులు కట్టేవాళ్లు అతి తక్కువగా ఉన్నారు. కేవలం ఒక్క శాతం మందే ట్యాక్స్‌లను సక్రమంగా చెల్లిస్తున్నారు. దీంతో లోయెస్ట్ ‘ట్యాక్స్–టు–జీడీపీ’ రేషియో ఉన్న దేశాల్లో ఇదీ ఒకటిగా చేరింది. పన్నులు ఎగ్గొట్టేవాళ్లను కట్టడి చేయడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అయ్యాయనటం కంటే కావాలనే వదిలేశాయనటం కరెక్టేమో. ఎందుకంటే అలాంటి ఉన్నత వర్గాల వారికే సర్కారులో మెజారిటీ పదవులు కట్టబెట్టారు కాబట్టి.
గోధుమల గొడవ
సమ్మర్లో రూ.3000కే వచ్చిన వంద కిలోల గోధుమ బస్తా రేటు ఇప్పుడు రూ.1500 పెరిగింది. గోధుమల స్టాకు రిలీజ్ చేశామని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నా ఓపెన్ మార్కెట్లోని ధరల్లో మాత్రం పెద్ద తేడా లేదు. క్వింటా గోధుమల రేటు నామమాత్రంగా రెండు మూడొందలే (రూ.4700–4800 నుంచి రూ.4400–4500కి) తగ్గింది.
సినిమా చూపిస్తున్న ‘టమాటా’
సుమారు 30 ఏళ్ల కిందట వచ్చిన ఓ సినిమాలో హీరోహీరోయిన్లు టైమ్ మెషీన్లో ఫ్యూచర్లోకి వెళతారు. అది కరెక్ట్‌గా 2504వ సంవత్సరం. కిలో టమాటా రేటు రూ.1,500 మాత్రమేనని, ఇంటికొచ్చేటప్పుడు రెండు మూడు కిలోలు తేవాలని ఓ భార్య తన భర్తకు చెబుతుంది. ఆ సీన్ చూసినోళ్లకు తెగ నవ్వొస్తుంది. కిలో టమాటా కేవలం 1500 మాత్రమే అంటే కామెడీ అనుకున్నాం. కానీ.. 2019లోనే పాకిస్థాన్‌లో కిలో టమాటా ధర రూ.300పైన పలుకుతోంది. దీన్ని బట్టి ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత గజిబిజిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మిలటరీ రూటు సెపరేటు
పాకిస్థాన్ ప్రభుత్వంలో సైన్యం మాటకు తిరుగులేదంటారు. ఆ దేశంలో మిలటరీకి గవర్నమెంట్ ఫండ్సే రావాల్సిన పనిలేదు. ఎందుకంటే అక్కడి సైన్యం పెద్దఎత్తున చేపట్టే బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా దానికి డబ్బు బాగానే వస్తుంది. పాక్ సైన్యానికి దాని పరిధిలోని 50కిపైగా కమర్షియల్ ఎంటిటీల నుంచి ఏటా ఒకటిన్నర బిలియన్ డాలర్ల రాబడి వస్తోంది. మిలటరీ రీసెంట్గా మైనింగ్, ఆయిల్, గ్యాస్ సెక్టార్‌లోకి ప్రవేశించింది. వీటిలో కొన్ని వెసులుబాటులను ఇమ్రాన్‌ఖాన్ సర్కారే కల్పించింది. సైన్యానికి సొంత రాబడి బాగానే ఉన్నా గవర్నమెంట్ ఫండ్స్‌పై ఆధారపడుతోంది. ఎకానమీ ఇబ్బందుల్లో ఉండటంతో మిలటరీ తనకుతానే బడ్జెట్‌ని తగ్గించుకుంటానన్నట్లు ఇమ్రాన్‌ఖాన్ ఆమధ్య చెప్పారు. కానీ.. ఆచరణలో అలా జరగలేదు. పోయినేడాది కన్నా ఈసారి బడ్జెట్లో 17.6 శాతం ఎక్కువ నిధులిచ్చారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్ ప్రకటన ఐఎంఎఫ్ వంటి ఇంటర్నేషనల్ క్రెడిటర్స్ని తప్పుదోవ పట్టించేలా ఉందనే విమర్శలు వచ్చాయి.