పాకిస్తాన్ ఓ విఫల ప్రయత్నం..ఆది నుంచీ సంక్షోభాలే!

ప్రస్తుతం ఆర్థికంగా శ్రీలంక మార్గంలోకి వెళ్లిపోతున్న పాకిస్థాన్​ ఉత్పాదక శక్తిని పెంచుకోకుండా ‘ఉన్మాదం’ నూరిపోస్తూ తనకు తానే దిగజారింది. 2022 నుంచే అక్కడ ఆర్థిక సంక్షోభం మొదలైంది. చైనా కబంధ హస్తాల్లోకి వెళ్లి తాకట్టులో పడింది. తెలివిమాలిన నాయకత్వం, సైన్యం కుట్రలు, మతోన్మాదుల వీరంగం, పిచ్చి భారత వ్యతిరేకత, అజ్ఞానులైన జనం, తీవ్రవాద తండాలు వెరసి ఇప్పుడు ఆ దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశాయి. 

శ్రీలంక తర్వాత పాకిస్థాన్ ఇప్పుడు అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వైపు పయనిస్తోంది. ఏ ‘జాతీయ భావన’ లేకుండా మేడిపండులా లోపల మతతత్వం, పైకి రాజకీయంతో కవ్వించి భారత్​ను విభజించి ఏర్పడిన పాక్​అసలు స్వరూపం ఇప్పుడు బయటపడుతున్నది. పాక్ ఏర్పాటుకు పరోక్షంగా సహకరించిన సర్ సయ్యద్ అహ్మద్​ఖాన్ లాంటివాళ్లు భారత్​లో ఇంకా గౌరవం పొందుతున్నారు. కానీ పాక్ కోసం ప్రత్యక్ష పోరాటం చేసిన మహ్మద్​ అలీ జిన్నా ఆ దేశం ఏర్పడ్డాక అక్కడి మతోన్మాదుల చేతిలో ఘోర అవమానాల పాలయ్యాడు. బతికిన కొన్ని నెలలు జిన్నా “నాకు కోపం తెప్పించకండి. మీరు ఎక్కువ చేస్తే నెహ్రూ దగ్గరికెళ్లి పాక్​ను ఇండియాలో కలిపేయాలని అడుగుతాను’’ అని బ్లాక్​మెయిల్ చేసేవాడట.

పదవీ త్యాగాలన్నీ అవమానాలతోనే..

పాక్ మొదటి అధ్యక్షుడు ఇస్కందర్​మీర్జా దుర్భర జీవితం జీవించి వైద్యం కూడా చేయించుకోలేని స్థితిలో మరణించాడు. కనీసం శవాన్ని పాక్​కు రానివ్వకపోతే ఇరాన్​కు తీసుకెళ్లి అంతిమ సంస్కారం చేశారు. అప్పటి మీర్జా మొదలుకొని నిన్న మొన్నటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వరకు అందరూ ఘోర పరాభవం, విదేశీ జీవితం, హత్య, జైలు జీవితం, అవమానకర రీతిలో పదవీత్యాగం చేసినవారే. లియాఖత్ అలీఖాన్, జుల్ఫీకర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో క్రూరమైన హత్యకు గురయ్యారు. ఇక మిగిలిన అధ్యక్షులు, ప్రధానులందరి పదవీ విరమణ దుర్భర సంక్షోభంతో జరిగినవే. తూర్పు పాక్​లో 1952లో మొదలైన ఉర్దూ వ్యతిరేకోద్యమం1971 వరకు కొనసాగి పాక్ సైన్యం చేతిలో బెంగాలీల హత్యాకాండకు దారితీసింది. చివరకు1971 డిసెంబర్16న బంగ్లాదేశ్ ఏర్పడింది. మరోవైపు ‘బలూచీ’లు ఇప్పటికీ స్వయంప్రతిపత్తి కావాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. 

నిజానికి బలూచీలు నాడే భారత్​లో కలుస్తామంటే నెహ్రూ తిరస్కరించారని తారేఖఫతే చెప్పాడు. స్వాతంత్య్రం రాగానే 1947లో పాకిస్థాన్ అక్కడి గిరిజన తెగల పేరు చెప్పుకుని సైన్యాన్ని భారత్​పైకి దాడికి పంపింది. కాశ్మీర్​పై ఆ రోజు నుంచే కన్నేసి భారత్​పైకి పాలి పంచాయితీకి దిగింది. జిన్నా తర్వాత అధ్యక్షుడైన లియాఖత్ అలీఖాన్​ను  రావల్పిండిలో ఓ ముస్లిం యువకుడు చంపగా 1979లో జుల్ఫీకర్ అలీ భుట్టోను చట్టబద్ధంగా ఉరితీశారు.11 ఏండ్లు పాక్​ను ఏలిన జనరల్ జియా ఉల్ హక్ విమాన ప్రమాదంలో చనిపోయాడు. అది కూడా కుట్రే అంటారు. 35వ ఏట బెనజీర్ భుట్టో పాక్​ ప్రధాని అయి, హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ దేశాన్ని విడిచిపెట్టాడు. పర్వేజ్ ముషారఫ్, ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్పుడు బయట నుంచే రాజకీయాలు చేస్తున్నారు.

భారత్​పై పాక్​ దాడి

1965లో అయూబ్​ఖాన్ నేతృత్వంలో పాక్ మనపై దాడిచేస్తే దాన్ని మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో భారత్ గట్టిగా ఎదుర్కొన్నది. 1971 యుద్ధాన్ని ఇందిర దీటుగా ఎదుర్కోవడమే కాకుండా పాక్​ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని అటల్ బిహారీ వాజ్​పేయ్ నేతృత్వంలో భారత్ సమర్థంగా ఎదుర్కొన్నది. 1971 యుద్ధంలో ఘోరంగా ఓడిన పాక్ మనపై పరోక్ష యుద్ధానికి తెరతీసింది.1977 నుంచి ‘కాశ్మీర్’ పేరుతో జనరల్ జియా ఉల్ దుష్ట నాయకత్వంలో ఈ పరోక్ష యుద్ధం మరింత తీవ్రం అయింది. కాశ్మీర్​లో ‘ఇస్లామిక్ స్టేట్’ పేరుతో ఐఎస్ఐ తీవ్రవాదం ప్రోత్సహించింది. తాలిబన్లను, ముజాహిదీన్ సంస్థలను పాక్​ పరోక్షంగా ప్రోత్సహించి తీవ్రవాద కేంద్రంగా మారింది. గిల్గిట్, బాల్టిస్థాన్, పంజాబ్ మొదలైన ప్రాంతాలను విడదీసి ‘నార్తర్న్ ఏరియా’ అని పేరు పెట్టి అక్కడి షియాలపై దారుణ హత్యాకాండ జరిపారు. 

బలూచీలను ఊచకోత కోశారు. ఇక అక్కడి హిందువులపై ఈ రోజుకూ దమనకాండ జరుగుతూనే ఉంది. పాక్ ఏర్పడ్డప్పుడు అక్కడున్న 33 శాతానికి పైగా హిందువులు ఇప్పుడు సింగిల్ డిజిట్​కు పడిపోయారు. హఫీజ్​ సయీద్, ముల్లా ఒమర్, ఒసామా బిన్​లాడెన్​లకు ఆశ్రయం ఇచ్చిన పాక్​అఫ్జల్​గురు, అజ్మల్​కసబ్​లాంటి వారిని ఈ రోజుకూ భారత్​కు పంపుతూనే ఉంది. వాళ్ల బడ్జెట్​లో 30 శాతం సైన్యంపై ఖర్చు చేస్తే 2.5 శాతం మాత్రమే విద్యకు కేటాయిస్తారు. 65 శాతం ఇతర దేశాల అప్పులు తీర్చడానికి కేటాయించక తప్పని పరిస్థితి. దేశంలో పన్ను చెల్లింపుదార్లు 2 శాతం మాత్రమే ఉండటంతో ఆ దేశం ఆర్థికంగా శిథిలమైంది. సైన్యం కీలు బొమ్మలుగా గద్దెపై కూర్చున్న ప్రధాని షహబాజ్ షరీఫ్, జనరల్ బజ్వా, ఇమ్రాన్ ఖాన్, బిలావల్ భుట్టో ఆడుతున్న నాటకంలో పాక్​కుతకుత ఉడుకుతోంది. 

ఆర్థిక సంక్షోభం.. అంతర్గత సంక్షోభం..

ప్రస్తుతం ఆర్థికంగా శ్రీలంక మార్గంలోకి వెళ్లిపోతున్న పాక్ ఉత్పాదక శక్తిని పెంచుకోకుండా ‘ఉన్మాదం' నూరిపోస్తూ తనకు తానే దిగజారింది. 2022 నుంచే అక్కడ ఆర్థిక సంక్షోభం మొదలైంది. చైనా కబంధ హస్తాల్లోకి వెళ్లి తాకట్టులో పడింది. వృద్ధిరేటు తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. నిరుద్యోగం పెరిగి యువకులు తీవ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణాకు తెగబడుతున్నారు. పీబీఎస్ ప్రకారం గోధుమపిండి 57 శాతం, ఉల్లి ధర115 శాతం పెరగడం ఆ దేశ ఆర్థిక దుస్థితిని తెలుపుతున్నది. 30 శాతం జీడీపీతో, ఆగస్టు 2022 నాటికి 27.3 శాతం ద్రవ్యోల్బణంతో పాక్ దీనంగా మారిపోయింది. ఆ దేశ రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 30 శాతం క్షీణించింది. ఆ దేశ నాయకులు కమిషన్ల కోసం చైనాతో చేసుకున్న ఒప్పందాలు కూడా  పాక్​ సంక్షోభానికి కారణం అయ్యాయి.  

తాము ఇన్నాళ్లు పెంచి పోషించిన తీవ్రవాదం తమపైనే భస్మాసుర హస్తం మోపుతుంటే ఏంచేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నది. ‘తహ్రీక్ -ఏ -తాలిబన్ పాకిస్థాన్’(టీటీపీ) అనే సంస్థ ప్రక్కనున్న అఫ్గాన్​తాలిబన్లతో తమను పోల్చుకొంటూ పాక్​ను పూర్తిస్థాయి ఇస్లామిక్ స్టేట్​గా చేయాలనే ప్రయత్నం చేస్తోంది. టీటీపీ సమాంతర ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా పాక్​పై ‘జిహాద్’ ప్రకటించింది. ఈ సంక్షోభాలు ఎదుర్కోలేక ప్రధాని షహబాజ్ షరీఫ్, విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నోరు వెళ్లబెట్టేస్తున్నారు. భారత్​లో బలమైన ప్రభుత్వం ఉండటంతో పాక్ పాచికలు పారడం లేదు. ఏది ఏమైనా జిన్నా నుంచి షహబాజ్ షరీఫ్ వరకు అంతా సైన్యం, మతోన్మాద ఐఎస్ఐ చేతిలో కీలుబొమ్మలే. ఈ విఫల దేశం సాధించింది ఏమీ లేదు. కానీ తీవ్రవాద పోషకురాలిగా మారింది. అందుకే పాకిస్థాన్ 

ఓ విఫల ప్రయత్నం..ఆది నుంచీ సంక్షోభాలే..

ద్విజాతి సిద్ధాంతంతో జిన్నా పాక్ ఏర్పాటుకు ప్రయత్నించాడు. దేశవిభజనతో సుమారు10 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో భాషలు, సంస్కృతులు, గుడులు, మఠాలు, ప్రాచీన కట్టడాలు పాక్ ఏర్పాటు వల్ల ధ్వంసమయ్యాయి. పాక్ ఏర్పాటు ఆనాటి ఒక అంతర్జాతీయ కుట్ర. మన నాయకులు దాన్ని పసిగట్టలేకపోయారని ఎందరో పరిశోధకులు ఆ తర్వాతి కాలంలో తేల్చారు. “మతం గురించి ఏమాత్రం పట్టని జిన్నా ఓ మత రాజ్యం సృష్టించాలనుకున్నాడు. సంపూర్ణ మతవిశ్వాసి అయిన గాంధీజీ ‘లౌకికరాజ్యం’ కోరుకుంటున్నాడు” అని లూయీ ఫిషర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 

జిన్నా బతికుండగానే పాక్​లో సంక్షోభాలు మొదలయ్యాయి. అప్పట్లోనే పాక్ సైన్యం ఇతర మత శక్తులతో కలిసి జిన్నాను గద్దె నుంచి దింపాలని చూసింది. ఈ సంగతి తెలిసిన జిన్నా సైనిక దళాలతో మాట్లాడాలని ‘క్వెట్టా’ వెళితే స్వాగతం పలికేందుకు ఎవరూ రాలేదు. అక్కడే అతని ఆరోగ్యం పాడైతే చెడిపోయిన అంబులెన్సులో తరలించారు. నడిరోడ్డుపై ఈగలు వాలుతుంటే భయంకర వేడిలో జిన్నా ఎదురు చూడాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా ఆసుపత్రికి తీసుకెళ్లినా జిన్నా బతకలేదు. - పి. భాస్కర యోగి, సోషల్​ ఎనలిస్ట్