- థర్మల్ ప్రాజెక్టులు మూతపడ్డయ్
- సింగరేణి స్థలాల్లో ఐటీ హబ్
హైదరాబాద్: గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రూ.130 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ కోసం రూ.42 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అయినా ఇంటింటికి తాగు నీరు ఇవ్వలేదన్నారు. ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పారని, రూ.125 కోట్లతో మళ్లీ పనులు ఎందుకు చేపడతామని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ చాలా గ్రామాలకు మంచి నీరు అందడం లేదన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక విధ్వంసం చేశారన్నారు. గతంలో వెలుగులు నింపిన థర్మల్ ప్రాజెక్టులు మూతపడ్డాయని విమర్శించారు. థర్మల్ ప్రాజెక్టులు మొదలు పెడితే ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ప్రజలు కోరుతున్నట్లుగా పాల్వంచ, కొత్తగూడం మున్సిపాలిటీని కలుపుతామన్నారు. కొత్తగూడెంపి సింగరేణి స్థలాల్లో ఐటీ హబ్ ఏర్పాటు, ఐటీ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సీతారామా ప్రాజెక్టుకు 70 కోట్లు రిలీజ్ చేయడంతో పనులు జరిగి నిన్న రాత్రి ట్రయల్ రన్ సక్సెస్ అయిందన్నారు.
రెండు గంటల్లో విజయవాడకు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరేలా రోడ్లను నిర్మిస్తున్నామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్ల రోడ్డుగా నిర్మిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి రాష్ట్రానికి పలు జాతీయ రహదారులు తీసుకొచ్చామన్నారు. రాష్ర్ట్ంలో రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తామన్నారు. 5,6 నెలల్లో కొత్తగూడంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. తమపై చేసే విమర్శలను పట్టించుకోబోమని, అభివృద్ధిపై నే దృష్టి పెడతామని మంత్రి వెంకటరెడ్డి అన్నారు.
30 వేల కోట్లతో రుణమాఫీ ; మంత్రి పొంగులేటి
రాష్ట్రంలోని రైతులకు దాదాపు 30 వేల కోట్లతో రెండు లక్షల రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధిలో అన్నికులాలకు, మతాలకు సమాన ప్రాతినిథ్యం ఇస్తున్నామన్నారు. సీతరామా ప్రాజెక్టుతో ఖమ్మ, నల్గగొండకు గోదావరి సాగు నీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో 9 వేల కోట్లను గత ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. తమది రైతుల ప్రభుత్వం అని చెప్పారు. ప్రజలు కన్న కలలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన అన్నారు.
ఆయన ఢిల్లీ వెళ్తె రోడ్డు వచ్చినట్టే : మంత్రి తుమ్మల
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళితే రాష్ట్రానికి జాతీయ రాహదారి వచ్చినట్టేనని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి కొత్త రోడ్ శాంక్షన్ చేసి తీసుకొస్తారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్‌తో గోదావరి జలాలను ఈ వానాకాలంలోనే సాగు కోసం అందిస్తామన్నారు. గత ప్రభుత్వం సీతారామా ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.