బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో ఆర్థిక విధ్వంసం

  • వేల ఎకరాలను కొల్లగొట్టి, వేల కోట్లు కూడబెట్టిన్రు
  • హరీశ్‌‌రావు, కేటీఆర్‌‌ పిచ్చికుక్క కరిచినట్లు ప్రవర్తిస్తున్నరు
  • స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ పదేండ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. గురువారం జరిగిన జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌గా మారుజోడు రాంబాబు బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కడియం హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పదేండ్లలో కేసీఆర్‌‌ ఫ్యామిలీ వేల ఎకరాలు కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించారన్నారు. నీతి, నిజాయితీ అనే పదాలు వాళ్ల డిక్షనరీలోనే లేవని ఎద్దేవా చేశారు. బీఆర్‌‌ఎస్‌‌ విధ్వంసం, అవినీతి, అక్రమాల మరకలు తనకు అంటవద్దన్న ఉద్దేశంతోనే బయటకు వచ్చానని చెప్పారు. 

అవినీతి అనేక తన జీవితంలోనే లేదని, తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌‌ చేశారు. బీఆర్‌‌ఎస్‌‌ పార్టీని హరీశ్‌‌రావు హస్తగతం చేసుకుంటారని, తాను జైలుకుపోవుడు తప్పదని కేటీఆర్‌‌కు భయం పట్టుకుందన్నారు. కార్‌‌ రేసింగ్‌‌ అవినీతి, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌తో పాటు లగిచర్లలో అధికారులపై దాడికి అక్కడి మాజీ ఎమ్మెల్యేను​ కేటీఆరే పురమాయించినట్లు తెలుస్తోందన్నారు. కేటీఆర్‌‌, హరీశ్‌‌రావులు పిచ్చికిక్క కరిచినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. 

కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చి ఏడాదే అయిందని, ఇంకా నాలుగేండ్ల టైం ఉందని, అప్పుడే ఏదో జరిగిపోయినట్లు అసత్యఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అయినా ఆర్థిక వనరులను పెంచుకుంటూ ఆరు గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్‌‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. సన్న వడ్లకు బోనస్‌‌.. బోగస్‌‌ అని హరీశ్‌‌రావు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లను ప్రజలు అసహ్యించుకుంటున్నా వారికి బుద్ధి రావడం లేదన్నారు. సోషల్‌‌మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌‌ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి, జనగామ మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ బనుక శివరాజ్‌‌యాదవ్‌‌ ఉన్నారు.