- పెరుగుతున్న ఆర్థిక మోసాలు, నేరాలు
- తక్కువ రేట్లకే భూములు, అధిక వడ్డీ అంటూ చీటింగ్
- పెట్టుబడికి రెట్టింపు రాబడులంటూ అసలుకే ఎసరు పెడుతున్నరు
- రిటైర్డ్ ఎంప్లాయిస్, వ్యాపారులు, సామాన్యులే టార్గెట్
- సివిల్ మ్యాటర్స్‌లో జోక్యం చేసుకోలేమంటున్న పోలీసులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఆర్థికమోసాలు, నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు జనాల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాళ్లను నిండా ముంచుతున్నారు. తక్కువ రేట్లకే భూములు కొనిస్తామని లేదా అమ్మి పెడతామని అందినంత దోచుకుంటున్నారు. అధిక వడ్డీ చెల్లిస్తామని కోట్లలో అప్పులు చేసి ఉడాయిస్తున్నారు. కొంతమంది ఆర్థిక అవసరాల గురించి తెలుసుకొని స్వల్ప వడ్డీకే లోన్లు ఇప్పిస్తామని లక్షల్లో దండుకుంటున్నారు. కొన్ని యాప్‌లలో పెట్టుబడులు పెడితే వంద రోజుల్లోనే డబుల్రిటర్న్స్వస్తాయని, షేర్మార్కెట్లో ఇన్వెస్ట్‌చేస్తే దండిగా లాభాలు వస్తాయని.. ఇలా ఎన్నో మాయమాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లలో కలెక్షన్చేసుకొని అడ్రస్‌లేకుండా పోతున్నారు. సింగరేణి, గవర్నమెంట్ఎంప్లాయీస్, రిటైర్డ్‌ఎంప్లాయీస్, వ్యాపారులు, సామాన్యులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నారు.
లోన్ ఇప్పిస్తానని రూ.33 లక్షలు దోపిడీ...
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఖద్దరు బట్టలు వేసుకొని ఖరీదైన కారులో తిరుగుతుంటాడు. ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉన్నతాధికారులతో ఫొటోలు దిగి వారంతా తనకు బాగా క్లోజ్అంటూ పబ్లిసిటీ చేసుకుంటాడు. లిటిగేషన్ భూముల సెటిల్మెంట్లతో పాటు ఎలాంటి పనిఉన్నా చేసి పెడుతానంటాడు. ఇటీవల ఓ వ్యాపారికి భారీగా డబ్బులు అవసరం ఉన్నట్టు తెలుసుకొని తాను రూ.3 కోట్ల లోన్ఇప్పిస్తానని నమ్మబలికాడు. వాళ్లకు వీళ్లకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి దశలవారీగా రూ.33 లక్షలు వసూలు చేసి చేయిచ్చాడు. బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను
ఆశ్రయించాడు.
భూమి కొనిస్తామని రూ.60 లక్షలు వసూలు
కెనడాలో జాబ్ చేస్తున్న జిల్లావాసి ఒకరు అక్కడ పైసా పైసా వెనకేసి సంపాదించిన సొమ్ముతో ఇక్కడ భూమి కొనాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు అతడిని ఫ్రాడ్చేయాలని ప్లాన్‌వేశారు. ఓ రిటైర్డ్ఎక్స్సర్వీస్మెన్కు గవర్నమెంట్ఇచ్చిన ల్యాండ్‌ను అమ్మకానికి పెట్టాడని చెప్పారు. ‘అతడికి అర్జంట్‌గా డబ్బులు కావాలి. నువ్వు ఇస్తావా, ఇతరులకు అమ్ముకోమంటావా?’ అంటూ డైలమాలో పడేశారు. తక్కువ రేటుకే వస్తుందని చెప్పి అడ్వాన్స్‌గా రూ.60 లక్షలు తీసుకున్నారు. తీరా డాక్యుమెంట్లు చెక్ చేస్తే అవన్నీ ఫేక్ అని తేలింది. ఆ పేరిట ఎక్స్‌సర్వీస్ మెన్ లేడు, భూమీ లేదని తెలిసి షాక్ తిన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
షేర్ మార్కెట్లో పెట్టుబడులని..
జిల్లా కేంద్రానికి చెందిన ఓ జ్యూవెల్లరీ వ్యాపారి తెలిసిన వారి దగ్గర పెద్ద మొత్తంలో బంగారం తీసుకున్నాడు. కోట్లలో అప్పులు చేశాడు. ఆ పైసలను షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్టు సమాచారం. నగలు, డబ్బులు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేయడంతో ఇటీవల జువెల్లరీ బోర్డు తిప్పేసి, కుటుంబసభ్యులతో కలిసి పారిపోయాడు. అతడు దాదాపు రూ.10 కోట్లకు పైగా అప్పులు చేసి ఉడాయించినట్టు చెప్పుకుంటున్నారు.
అప్పులు చేసి ఐపీ పెట్టిండు
కాగజ్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఒక బ్యాంకులో సీఎస్పీ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. తెలిసిన వాళ్లకు అధిక వడ్డీ ఆశచూపి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల దాకా అప్పు తీసుకున్నాడు. రూ.10 కోట్లకు పైగా కలెక్షన్ చేశాడని సమాచారం. నెలలు గడుస్తున్నా వడ్డీ లేదు, అసలు లేదు. అప్పు ఇచ్చిన వాళ్లు తమ పైసలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో ఇటీవల కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్(ఐపీ) దాఖలు చేశాడు. రుణదాతలకు కోర్టు నుంచి ఐపీ నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నారు.
పోలీసులూ ఏమీ చేయలేరు...
ఇలాంటి చీటర్ల చేతిలో మోసపోయిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఇవి సివిల్ మ్యాటర్స్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకోలేని పరిస్థితి. సెక్షన్420 కింద చీటింగ్ కేసు పెట్టి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపడం మినహా దోచుకున్న డబ్బులను ఇప్పించలేరు. కోర్టుకు పోతే కేసులు కొలిక్కి వచ్చేసరికి ఏండ్లు గడుస్తున్నాయి. ఈలోగా నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చి హాయిగా తిరుగుతున్నారు. ఇలాంటి చీటర్లు అన్నింటికీ తెగించే మోసాలకు పాల్పడుతుంటారని ఓ పోలీస్అధికారి తెలిపారు. ప్రజలు అత్యాశకు పోయి పైసలు పోగొట్టుకోవద్దని, ఇలాంటి వారిపట్ల అలర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు.