- ఓవైపు వైట్‌కాలర్ నేరగాళ్లు, మరోవైపు నైజీరియన్స్
- సైబర్ ఫ్రాడ్స్చైన్ సిస్టమ్‌తో మెంబర్‌షిప్,
- స్టార్ హోటల్స్‌లో సెమినార్స్
- తక్కువ డిపాజిట్ చేసి రూ.వందల కోట్లు దోచేస్తున్నారు
- మోసగాళ్ళు దొరికినా రికవరీ సున్నా
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తమ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే మంచి కమీషన్, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఆర్థిక నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడుతున్నారు. స్టార్ హోటల్స్‌లో మీటింగ్స్ నిర్వహించి అట్రాక్ట్ చేస్తున్నారు. రూ.500లతో మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ చేయించి వారికి సులువైన ఆన్‌లైన్ టాస్క్ ఇస్తున్నారు. అవి పూర్తి చేసినవారికి ప్రైజ్‌మనీ, గిఫ్ట్స్, టూర్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఇలా తమ ట్రాప్‌లో చిక్కినవారితో రూ.10 వేలు నుంచి వారి స్థోమతను బట్టి రూ.10లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మొదట్లో కొంత డబ్బు డిపాజిట్ చేసి ఆ తర్వాత అందినంత దోచేస్తున్నారు. ఏజెంట్స్‌తో కలిసి రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఇలాంటి వైట్ కాలర్ నేరాల్లో మోసగాళ్లు దొరుకుతున్నా.. వారు కొట్టేసిన రూ.కోట్లు మాత్రం రికవరీ కావట్లేదు.
ఆన్‌లైన్ అడ్డాగా సైబర్ క్రైమ్స్
గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రతి ఏటా ఇలాంటి మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సైబరాబాద్ కమిషనేట్ పరిధిలో నమోదైన కరక్కాయ, ఈ బిజ్.కం, క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో రాష్ట్రవ్యాప్తంగా వేల మందిని రోడ్డున పడేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మంలో హ్యాపీ ఫ్యూచర్ పేరుతో జరిగిన చైన్ సిస్టమ్ వ్యాపారంలో వందల సంఖ్యలో డిపాజిటర్లు మోసపోయారు. వీటితో పాటు సన్‌పరివార్, ఫ్యూచర్ మేకర్స్ లైఫ్ కేర్ హెల్త్ ప్రొడక్ట్స్, ప్రో హెల్త్ వెజ్ పేరిట మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో వైట్ కాలర్ నేరగాళ్ళు రూ.వేల కోట్లు కొట్టేశారు. ఇవే కాకుండా ఆన్‌లైన్ అడ్డాగా నైజీరియన్స్ సైబర్ క్రైమ్స్‌కు పాల్పడుతున్నారు. గిఫ్ట్స్, లాటరీ, ఇన్వెస్ట్‌మెంట్స్, జాబ్ ఫ్రాడ్స్‌తో అందినంతా దోచేస్తున్నారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా దాదాపు రూ.700కోట్లు మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసగాళ్ళు దోచేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
బినామీల పేర్లతో ఆస్తులు, ల్యాండ్స్, వెహికల్స్
మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసగాళ్ళ చేతుల్లో నష్టపోతున్న బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. నేరస్తులు అరెస్ట్ అవుతున్నారు తప్ప వాళ్ళు కొట్టేసిన డబ్బు రికవరీ శాతం తక్కువగా ఉంటున్నది. అందుకు కారణం వైట్‌కాలర్ నేరగాళ్లు తాము దోచుకున్న సొమ్ము పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. స్కీమ్స్ పేరుతో కొట్టేసిన డబ్బును పక్కాగా దారి మళ్లిస్తున్నారు. తమ పేరుతో ఎలాంటి బ్యాంక్ అకౌంట్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అకౌంట్స్ ఉన్నప్పటికీ అందులో బ్యాలెన్స్ మాత్రం ఉంచడం లేదు. ఇతరుల పేరుతో ఆస్తులు, ల్యాండ్స్, వెహికల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదులతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా వాళ్లు దోచుకున్న డబ్బును రికవరీ చేయడంలో సవాళ్లు ఎదురౌతున్నాయి.
నైజీరియన్ల నుంచి రికవరీ సున్నా
ఆన్‌లైన్ మోసాలకు నైజీరియన్లు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. విదేశాల్లో ఉండి ఇండియాలో చీటింగ్ చైన్ రన్ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాకు చెందినవారితో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. హోల్‌సేల్‌గా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. షిప్పింగ్యార్డ్ ల నుంచి కన్‌సైన్‌మెంట్ పార్సిల్ రూపంలో కార్గో షిప్స్‌లో నైజీరియాకు తరలిస్తున్నారు. స్థానిక మార్కెట్స్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా ఓపెన్ చేసే అకౌంట్ల నుంచి ఏటీఎం కార్డ్స్ తీసుకుని ఆన్‌లైన్ లో కొల్లగొట్టిన డబ్బు డ్రా చేసుకుంటున్నారు.ఇందులో మ్యాట్రిమోనియల్, గిఫ్ట్స్, లాటరీ, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ నైజీరియన్లకు కాసుల పంట పండిస్తున్నది. సైబర్‌నేరాల్లో నైజీరియన్స్, సోమాలియన్స్ ఎక్కువగా ఉండడంతో క్యాష్ రికవరీ చేయడం సాధ్యం కావడం లేదు. సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ మాత్రమే పోలీసులు రికవరీ చేయగలుగుతున్నారు. దీంతో బాధితులు కోల్పోయిన డబ్బు తిరిగి వారికి చేరే అవకాశం లేకుండా పోతున్నది.
మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్స్, ఇతర స్కీమ్స్‌కి అనుమతి లేదు. తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా స్కీమ్స్ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేస్తాం. తక్కువ సమయంలో ఎక్కువ లాభం, కమీషన్ ఇస్తామంటే నమ్మకూడదు. ఆశపడితే డబ్బు కోల్పోవలసిందే. రికవరీ కాకుండా నేరస్థులు ఖర్చు చేస్తున్నారు. దీంతో బాధితులు నష్టపోక తప్పదు. ఇలాంటి వైట్‌కాలర్ స్కీమ్స్ గురించి తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇతరులు మోసపోకుండా కాపాడాలి.
‑ సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్
పర్‌ఫెక్ట్ హెర్బల్ కేర్ స్టోర్స్ బిజినెస్‌లో రూ.6 లక్షలు పెడితే 30 నెలల పాటు ప్రతినెలా రూ.30 వేలు ఇస్తామని నమ్మించారు. పర్‌ఫెక్ట్ బజార్ సూపర్ మార్కెట్‌లో రూ.25 లక్షలు డిపాజిట్ చేస్తే 36 నెలల పాటు ప్రతినెలా లక్ష ఇస్తామని నమ్మించారు. ఇలాంటి మరికొన్ని స్కీమ్స్‌తో ఢిల్లీకి చెందిన రియాజుద్దీన్, షకీల, పూజాకుమారి హైదరాబాద్‌లో సెమినార్స్ నిర్వహించారు. గిఫ్ట్‌లు, టూర్స్ పేరుతో ప్రజలను ఆకర్షించారు. దేశవ్యాప్తంగా 7వేల మందికి రూ.200 కోట్లు కుచ్చు టోపి పెట్టారు. ఈ గ్యాంగ్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
మెజోన్ ఈ మార్ట్ సూపర్ మార్కెట్, ఐడీ స్కీమ్స్‌లో రూ.4లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా 4 శాతం కమీషన్ చొప్పున రూ.1.2లక్షలు లాభాలు ఇస్తామని నమ్మించారు.40 నెలల పాటు డిపాజిట్స్ చేస్తామని చెప్పారు. సూపర్ మార్కెట్ కొనుగోళ్లలో 35 శాతం డిస్కౌంట్ వస్తుందని నమ్మించారు.హైదరాబాద్‌కు చెందిన 200 మంది బాధితుల వద్ద రూ.2 కోట్లు వసూలు చేశారు. యూపీ ఘజియాబాద్ అడ్డాగా దేశవ్యాప్తంగా మోసాలు చేసిన ఇజాద్ అహ్మద్‌ను సిటీ సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.