బీఆర్​ఎస్​ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం

బీఆర్​ఎస్​ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం
  • నాటి సర్కార్ పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన బాధిత కుటుంబాలు
  • ఒక్కో ఫ్యామిలీకి రూ.6 లక్షల చొప్పున రూ.9.98 కోట్లు రిలీజ్
  • రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలకు దక్కిన న్యాయం
  • 141 రైతు కుటుంబాలకు ఊరట

కరీంనగర్, వెలుగు: పంట నష్టపోయి.. అప్పుల బాధ కారణంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాలకు చెందిన 141 మందికి  రూ.9.98 కోట్లు విడుదల చేసింది. ఒక్కో బాధిత కుటుంబానికి త్వరలోనే రూ.6 లక్షల చొప్పున అందజేయనున్నది. ఇందులో 2014 జూన్ 2 నుంచి 2021 వరకు సూసైడ్​ చేసుకున్న రైతులకు సంబంధించిన కుటుంబాలే ఉన్నాయి. వీరిలోనూ కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారు.

త్రీమెన్ కమిటీ రిపోర్టులను అమలు చేయని గత సర్కార్ 2014 జూన్‌‌ 2 తర్వాత పంటనష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.6 లక్షలు పరిహారంగా చెల్లించేందుకు గత బీఆర్ఎస్​ ప్రభుత్వం జీవో నం.173, 194 జారీచేసింది. ఈ జీవోల ప్రకారం ఎవరైనా రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఆర్డీవో, డీఎస్పీ, అగ్రికల్చర్ ఏడీతో కూడిన త్రీమెన్ కమిటీ విచారణ జరిపి.. ప్రభుత్వానికి రిపోర్ట్​ఇవ్వాల్సి ఉంటుంది. పంట నష్టం వల్లే చనిపోయినట్టు నిర్ధారిస్తే అతడు రైతయినా, కౌలు రైతయినా ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.

అప్పట్లో  పంట నష్టం, అప్పుల బాధతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు కేసు నమోదు చేసినా, త్రీమెన్ కమిటీలు రిపోర్టులు సమర్పించినా గత బీఆర్ఎస్​సర్కారు కొన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. ఇలాంటి కుటుంబాలు వందల్లో ఉన్నట్టు రైతు స్వరాజ్య వేదిక బాధ్యుల దృష్టికి వచ్చింది. దీంతో వేదిక కన్వీనర్ కొండల్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్‌‌ తరఫున అడ్వకేట్ వసుధా నాగరాజ్‌‌ వాదనలు వినిపించారు.

పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని 2023లోనే తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలులో భాగంగా తాజాగా 141 మంది బాధిత కుటుంబాలకు రూ.9,98,51,000 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. 

నాగర్ కర్నూల్ లో 32 కుటుంబాలకు..

రాష్ట్రవ్యాప్తంగా 141 బాధిత కుటుంబాలకు పరిహారం అందనుండగా.. అందులో నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 32 కుటుంబాలు సాయం పొందనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 18, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16, మహబూబాబాద్ జిల్లాలో 15, వరంగల్ జిల్లాలో 12, యాదాద్రి భువనగిరి,  జగిత్యాల జిల్లాలో 10 కుటుంబాల చొప్పున ఎక్స్ గ్రేషియా అందనుంది.

జనగామ జిల్లాలో 7, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి జిల్లాలో 4 చొప్పున, ములుగు 3, హన్మకొండ, మెదక్ 2 చొప్పున, వికారాబాద్, సంగారెడ్డి, కుమ్రం భీం అసిఫాబాద్, నల్లగొండ, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కో కుటుంబం సర్కార్ సాయం అందుకోనున్నది.

ఎంక్వైరీ చేయాలి 

గత సర్కార్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని వెంటనే త్రిసభ్య  కమిటీ అధికారులు సందర్శించి, ఎంక్వైరీ చేపట్టాలి. అసలు రైతు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరగాలి. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వానికి, ఈ న్యాయ పోరాటంలో సహకరించిన ప్రముఖ న్యాయవాది  వసుధ నాగరాజ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. కొండల్ రెడ్డి, కన్వీనర్, రైతు స్వరాజ్య వేదిక