కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలు.. బయటపెట్టిన CAG అధికారులు

కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలు.. బయటపెట్టిన CAG అధికారులు
  • రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా పరిపాలనా అనుమతులు 
  • జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టులో కాగ్ అధికారుల వెల్లడి
  • రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా పరిపాలనా అనుమతులు 
  • డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో అంచనా వ్యయం రూ.81,911 కోట్లు
  • రూ.1,10,248 కోట్లతో విడివిడిగా 73 అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్స్ 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు కంప్ట్రోలర్​ అండ్​ఆడిటర్ జనరల్​(కాగ్) అధికారులు వెల్లడించారు. డీపీఆర్‌‌‌‌‌‌‌‌లను ఆమోదించడానికి ముందే ప్రాజెక్టులో భారీ మార్పులు చేశారని, ప్రాజెక్ట్​ స్కోప్‌‌‌‌ను మార్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక నియమావళికి విరుద్ధంగా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు జారీ చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తంగా కాకుండా విడివిడిగా రూ.1,10,248 కోట్ల విలువైన 73 పరిపాలనా అనుమతులు జారీ చేశారని, అది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. 

ప్రాణహిత–చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ ​చేయడం వల్ల ఆర్థిక భారం పెరిగిందన్నారు. గురువారం కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ఎంక్వైరీకి కాగ్‌‌‌‌లో గతంలో డిప్యూటీ ఏజీగా పనిచేసి ప్రస్తుతం టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​, కమర్షియల్​ ట్యాక్సెస్ స్పెషల్​ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న జె.నిఖిల్​ చక్రవర్తి, ప్రస్తుత డిప్యూటీ ఏజీ నాగేశ్వర్​రెడ్డి, మరో అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌పై కాగ్ రిపోర్టును ఆడిటింగ్ సూత్రాలకు అనుగుణంగానే తయారు చేశారా? అని నిఖిల్​చక్రవర్తిని జ్యుడీషియల్​కమిషన్ చైర్మన్ ​జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ ప్రశ్నించారు. 

ప్రాజెక్టు ఖర్చు ఎందుకు పెరిగిందో నాటి ప్రభుత్వం నుంచి కాగ్‌‌‌‌కు రిప్లై వచ్చిందా? అని అడిగారు. దీనికి నిఖిల్ చక్రవర్తి సమాధానమిస్తూ.. ‘‘ఆడిటింగ్​ నిబంధనలు, సూత్రాలకు అనుగుణంగానే రిపోర్టును తయారు చేశాం. ప్రభుత్వం నుంచి రిప్లై వచ్చాకే పూర్తి రిపోర్టును పబ్లిష్ చేశాం” అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రిప్లైలకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని కమిషన్​ అడగ్గా, శుక్రవారం అందజేస్తామని చెప్పారు. 

బ్యాంకులతో 15 రుణ ఒప్పందాలు.. 

కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ అనేది ఆర్థికపరంగా ఫీజిబుల్ కాదని కాగ్ అధికారులు స్పష్టం చేశారు. కాగ్ రిపోర్టులో పేర్కొన్నవన్నీ వాస్తవాలేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక నియమావళికి విరుద్ధంగా అనుమతులు ఇచ్చారా? అని కమిషన్​ప్రశ్నించగా.. అవునని నిఖిల్ చక్రవర్తి బదులిచ్చారు. ‘‘రిపోర్టులో పేర్కొన్నట్టు తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో రూ.81,911.01 కోట్లుగా పేర్కొన్నారు.

ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి రూ.1,10,248 కోట్లతో విడివిడిగా 73 పరిపాలనా అనుమతులను మంజూరు చేసినట్టు రిపోర్టులో పేర్కొన్న మాట వాస్తవమే. అందులో టెక్నికల్​ సాంక్షన్స్​ కింద రూ.1,09,769.67 కోట్లు ఇచ్చారు. మార్చి 2022 నాటికి రూ.70,666.48 కోట్లు ఖర్చు చేశారన్నది వాస్తవం. మార్చి 2022 నాటికి కాళేశ్వరం కార్పొరేషన్ వివిధ బ్యాంకులతో 15 రుణ ఒప్పందాలను చేసుకున్నది” అని వెల్లడించారు. అయితే, ఆ రుణాలకు అనుగుణంగా కార్పొరేషన్‌‌‌‌కు పైసా ఆదాయం లేదని పేర్కొన్నారు.

ప్రాజెక్టు డిజైన్లలో లోపాలతోనూ ఆర్థిక భారం తప్పదని కాగ్​ రిపోర్టులో పేర్కొన్నారు కదా.. వాస్తవమేనా? అని కమిషన్​ ప్రశ్నించగా.. అవునని నిఖిల్ చక్రవర్తి చెప్పారు. రిపోర్టును కట్టుదిట్టంగా తయారు చేశారా.. అన్ని నిజాలేనా? అని  ప్రశ్నించగా.. 
అవునని బదులిచ్చారు.