
ఆదిలాబాద్/నస్పూర్, వెలుగు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కలెక్టర్ రాజర్షి షా 2కే రన్‌ను ప్రారంభించారు. బ్యాంకుల ఆర్థిక, అక్షరాస్యతపై మహిళలు, యువత సంపూర్ణ అవగాహన కలిగి పొదుపుతో పాటు అర్థిక స్వావలంబన పొందాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఎల్డీఎం ఉత్పల్ కుమార్, టీజీపీ రీజినల్ మేనేజర్ ప్రభుదాస్, డీవైఎస్వో వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకుల్లో పొదుపు చేసుకోవాలి
తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాంపల్లి శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించారు. రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలపై శాఖ నిర్వహణ అధికారి నరసింహ స్వామి వివరించారు. మహిళలు తమ సంపాదన, మిగులను బ్యాంకుల్లో పొదుపు చేసుకోవాలని సూచించారు. ఇందుకు నెలనెలా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకొని తెలివిగా పొదుపు చేసుకోవాలన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు.