ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తం

ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తం
  • ఈసారి బీజేపీకి చాన్స్​ ఇవ్వండి: కిషన్​రెడ్డి
  • మేధావులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలి
  • లోక​ల్​ బాడీ ఎలక్షన్స్​లో విజయం తమదేనని ధీమా
  • రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటివరకూ బీఆర్ఎస్, కాంగ్రెస్​ పాలన చూశారని, ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను  ఆ పార్టీ స్టేట్​ ప్రెసిడెంట్​, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కోరారు. రాష్ట్రాన్ని సమస్యల సుడిగుండం, ఆర్థిక సంక్షోభంనుంచి కచ్చితంగా గట్టెక్కిస్తామని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసేలా ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలని కోరారు.  తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ నాయకత్వంలో అంకితభావంతో బీజేపీ పనిచేస్తుందని చెప్పారు.

 ఆదివారం హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1980 ఏప్రిల్ 6న వాజ్ పేయి అధ్యక్షతన బీజేపీ ప్రారంభమైందని, ఆ రోజు పార్టీని చాలామంది అవహేళన చేశారని చెప్పారు. కానీ ప్రత్యేకమైన సిద్ధాంతంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది పార్టీ బాధ్యతలు నిర్వహించారని, చాలామంది బీజేపీ కార్యకర్తలు నక్సలైట్లకు, పాకిస్తాన్ ఐఎస్ఐ కు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించారని తెలిపారు.  

గతంలో నెహ్రూ కుటుంబానికి మాత్రమే దేశాన్ని పరిపాలించే శక్తి ఉన్నదంటూ ప్రచారం చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే,   సాధారణ కార్యకర్త కూడా దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించగలమని నిరూపించిన పార్టీ బీజేపీ అని చెప్పారు. రైల్వేస్టేషన్ లో టీ అమ్ముకునే సాధారణ వ్యక్తి కుమారుడు ఈ దేశాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నాడంటే ఆ ఘనత బీజేపీకే దక్కుతుందని తెలిపారు.  

బీజేపీవైపే ప్రజల చూపు

నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు.. ఇలా అనేక రకాల  కార్యక్రమాలు చేసినట్టు కిషన్​రెడ్డి చెప్పారు. ఇప్పటివరకూ తెలంగాణను బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పాలించాయని, కానీ  ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో ఫలమయ్యాయని ఆరోపించారు.  అందుకే రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు.  

పార్లమెంట్ ఎన్నికల్లో 77 లక్షల మంది ప్రజలు అండగా నిలిచారని  గుర్తుచేశారు. ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించిందని, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి  పదేండ్లలో ప్రజా వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ పార్టీ పది నెలల్లోనే అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను కూడగట్టుకుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీని పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు.

 హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడి రాజకీయ కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అవినీతి, అహంకారపూరిత పాలన నుంచి, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, కేసీఆర్ కుటుంబ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విద్యావేత్త మల్క కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.