- నష్టాలు, లోన్లు, బకాయిలు కలిపి రూ. 80 కోట్లు
- గత చైర్మన్ల అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం
- డెయిరీ చైర్మన్మధుసూదన్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : మదర్ డెయిరీలో గత పదేండ్లలో జరిగిన అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. జితేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకర్‌రెడ్డి చైర్మన్లుగా ఉన్న టైంలో అవినీతి జరిగిందన్నారు. శ్రీకర్‌రెడ్డి హయాంలోనే సంస్థ రూ. 12 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఇవి బయటపడకుండా ఆడిటర్లపై ఒత్తిడి తెచ్చి రెండు రకాల ఆడిట్ రిపోర్ట్‌లు రూపొందించారని ఆరోపించారు. లాభాల్లో ఉన్నట్లు చూపిన రిపోర్ట్‌తో బ్యాంకుల నుంచి రూ. 28 కోట్ల లోన్లు తెచ్చారని, వీటిపై ప్రతి నెలా రూ. 45 లక్షల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. మరో వైపు రూ. 35 కోట్ల నష్టంలో ఉన్నట్లు చూపించి, అప్పటి చైర్మన్లు సంతకాలు సైతం చేశారన్నారు.
రైతులకు కూడా రూ. 20 కోట్లు బకాయి పెట్టారని, రైతుల క్యాపిటల్ షేర్ రూ. 12 కోట్లు ఖర్చు చేశారన్నారు. అప్పులు, నష్టాలు, బకాయిలు కలిపి మొత్తం రూ. 80 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ అప్పులు తీర్చాలంటే మదర్‌డెయిరీకి మిర్యాలగూడ, హాలియా, చిట్యాల తదితర చోట్ల ఉన్న భూములను అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరో వైపు శ్రీకర్‌రెడ్డి హయాంలో అనర్హులను పర్మినెంట్ చేశారని, మరికొందరికి ప్రమోషన్లు ఇవ్వడంతో ప్రతి నెలా రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల భారం పడుతోందన్నారు. సంస్థ అప్పులు, ఆదాయంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. నిరర్ధక ఆస్తులను అమ్మడం ద్వారా నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తామన్నారు. ఇందుకోసం వచ్చే నెల 7న ప్రత్యేకంగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట డైరెక్టర్లు రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కల్లేపల్లి శ్రీశైలం, పుప్పాల నర్సింహులు ఉన్నారు.