గత బీఆర్‌‌ఎస్‌‌ పాలనతో కుదేలైన ఆర్థిక పరిస్థితి

గత బీఆర్‌‌ఎస్‌‌ పాలనతో కుదేలైన ఆర్థిక పరిస్థితి

పదేండ్ల బీఆర్‌‌ఎస్‌‌ పాలన ఉద్యమ నినాదాలకు భిన్నంగా తిరోగమన విధానాలకు వత్తాసు పలికింది.  నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ  పాలనలకు తిలోదకాలిచ్చి అహంభావంతో వ్యవహరించింది. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజలిచ్చిన తీర్పు బీఆర్‌‌ఎస్‌‌కు చెంపపెట్టులాంటిది.  రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధంగా ఏకవ్యక్తి నియంతృత్వానికి ప్రజలు బుద్ది చెప్పారు. అయినప్పటికీ బీఆర్‌‌ఎస్‌‌ నేతలు ఓటమి నుంచి పాఠం నేర్వలేదని వారి ప్రసంగాలు చూస్తే అర్థమవుతోంది.  కరీంనగర్‌‌లో  జరిగిన బహిరంగ సభలో మాజీ  సీఎం కేసీఆర్‌‌  ప్రసంగిస్తూ  ఎన్నికల్లో ప్రజలు అత్యాశకుపోయి, మోసపోయి కాంగ్రెస్‌‌ను గెలిపించారని అనడమే ఇందుకు నిదర్శనం.  ఓటమి కారణం తమ వ్యవహార శైలి అని గుర్తించకుండా,  ప్రజలనే అత్యాశపరులుగా చిత్రీకరించడం అంటే ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న గౌరవం ఏపాటిదో అర్థమవుతోంది.

ప్రాజెక్టుల పేరుతో వివిధ సంస్థల నుంచి గత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం లక్ష కోట్ల  రూపాయలు అప్పులు తెచ్చి..ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టు ప్రాణం తీసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎవరి ప్రయోజనం కోసం ఎందుకు నిర్మించినట్లు?  ఎత్తిపోతలకు ఎలక్ట్రిసిటి, నిర్వహణ ఖర్చు సంవత్సరానికి రూ.10,500 కోట్లు అవుతోంది. అప్పులు తిరిగి చెల్లింపు మరో రూ.15వేల కోట్లు. వెరసి ఏటా రూ.25వేల కోట్ల భారం ప్రజలపై పడుతున్నది. 

తుమ్మిడిహెట్టి నుంచి ప్రారంభమైన పనులను నిర్వీర్యం చేయడమేకాక ఆదిలాబాద్‌‌  జిల్లాకు రూ. 2 లక్షల ఎకరాలకు అన్యాయం చేసినట్లే కదా?  దాదాపు  రూ. 94,500 కోట్లు ఖర్చు పెడితే కేవలం  లక్ష ఎకరాలకు నీళ్లు,  స్థిరీకరణకు ఇంకా నీళ్లు అందించాలనే నిర్ణయం అమలేది?  మేడిగడ్డ బ్యారెజ్‌‌ కుంగిపోవడం కేసీఆర్‌‌  ప్రభుత్వ  వైఫల్యాలు, ఏకపక్ష నిర్ణయాలకు అద్దం పడుతున్నది. ఆత్మవిమర్శ లేని పద్ధతులలో  ప్రభుత్వంపైన  ఎదురుదాడి చేయడం దుర్మార్గం.

ఎక్కడవేసిన గొంగళి అక్కడే

గతంలో మిడ్‌‌మానేరు చేపట్టి సగానికి కంటే ఎక్కువ పని అయ్యింది కదా.  శ్రీరాంసాగర్‌‌ వరద కాలువ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండటం దారుణం.  మిగతా కృష్ణానది ఆధారిత ప్రాజెక్టులు అనేకం పెండింగ్‌‌లో ఉన్నాయి.  పాలమూరు, రంగారెడ్డిపైన ప్రతిపక్షాల సూచనలను, సలహాలను తుంగలో తొక్కడం ఎవరికి ప్రయోజనం?  నక్కలగండి ఎత్తిపోతల పథకం,  శ్రీరామ తదితర ప్రాజెక్టుల  ప్రగతి చతికలపడింది కదా. కొత్త ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం తక్షణమే ఏర్పాటు చేసి  ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలి. కాళేశ్వరం లోపాలపై కాంగ్రెస్​ ప్రభుత్వం న్యాయవిచారణ చేపట్టాలని నిర్ణయించడాన్ని  ప్రజలు హర్షిస్తున్నారు.

తాగునీటి పథకాలను సమీక్షించాలి 

నాబార్డు నిధులతో అనేక చెరువులు, కుంటలు మరమ్మతులు చేపట్టడం మంచి కార్యక్రమమే. అయినా, అందులో అధికారులు, కాంట్రాక్టర్లు అడ్డుగోలుగా అక్రమ సంపాదనకు పాల్పడ్డారు.  గత ప్రభుత్వాల కాలంలో అనేక మండలాలు, గ్రామాలకు శాశ్వత మంచినీటి పథకాలు చేపట్టి ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో  కొనసాగుతున్నాయి. వాటిని ఎందుకు నిర్వీర్యం చేసి వేలాది కోట్ల ప్రభుత్వ సొమ్మును నష్టం చేసినట్లనేది ప్రధాన ప్రశ్న? రూ. 45,000 వేల కోట్లు అప్పులు తెచ్చి చేపడితే అన్ని ఆవాసాలకు నీళ్లు అందుతున్నాయా?  మిషన్‌‌ భగీరథకు రిపేరులు వస్తే దానికి సరిచేసే యంత్రాంగం ఉండాలి కదా.  దానికి ఖర్చెంత? అట్టహాసంగా తిరుగులేని మహారాజులా వ్యవహరిస్తే ఎవరికి నష్టం కలుగుతుంది? అంతిమంగా ప్రజలకే ఇబ్బందులు.  నేటి కాంగ్రెస్‌‌ ప్రభుత్వం తక్షణం సమీక్ష చేసి గత  తాగునీటి పథకాలను నడిపించడానికి ప్రత్యేక కృషి చేపట్టాలి.  దీని పూర్వాపరాలపైన నిపుణులతో  సమీక్షించి గత తప్పిదాలను ప్రజల ముందుంచాలి.  దీనిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టాలి.  

భూములు కాజేశారు

2004లో  వైఎస్‌‌ రాజశేఖర్‌‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో భూ సమస్యలపై  కోనేరు రంగారావు అధ్యక్షతన ఏర్పడిన కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 104 సిఫారసులను రూపొందించి ప్రభుత్వానికి అందించింది. కానీ, అవి కూడా అమలు కాలేదు. ధరణి పోర్టల్‌‌ ఏర్పాటే దుర్బుద్ధితో జరిగింది.  తద్వారా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ  ప్రజాప్రతినిధులు చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకొని వందల కోట్ల విలువల కలిగిన భూములను స్వాధీనపరుచుకున్నారు. అన్యాక్రాంతమైన భూములను పట్టించుకోలేదు. పేదల ఇండ్ల స్థలాలకు 125 గజాలిస్తామని చెప్పి, మాటల గారడితో కాలం గడిపారు.  వక్ఫ్‌‌ బోర్డు,  దేవాదాయ, భూదాన యజ్ఞభూముల లాంటిపైన ప్రత్యేక దృష్టి సారించి అక్రమార్కులను తొలగించాలంటే సమగ్ర సర్వే మాత్రమే సర్వ రోగ నివారిణిగా గుర్తించాలి.  భూమాత కమిటీ ఇచ్చిన రిపోర్టుపైన కూడా సమగ్రమైన చర్చ జరగాలి.  శాశ్వత పరిష్కారం చేయాలి. 

ఉద్యోగాల కల్పనలో  బీఆర్ఎస్​  ఘోర వైఫల్యం

గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైంది. పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌లో ప్రశ్నపత్రాల లీకులుతో ప్రభుత్వ నిజస్వరూపం బట్టబయలైంది. ఉపాధ్యాయ నియామకాలు లేవు.  గురుకులాలలో ఉద్యోగాల భర్తీ చేపట్టినా తూతూ మంత్రంగానే సాగింది.  ప్రైవేట్‌‌ పరిశ్రమలలో  వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన పరిశ్రమల మంత్రి మాటలు నీటి మీద రాతలు లాగానే మారాయి. ప్రజల కనీస అవసరాలైన ఆరోగ్యం, విద్యుత్‌‌ శాఖలలో కూడా కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగ నియామకాలు లేక నిరాశ నిస్పృహలకు గురైన అనేకమంది ఉద్యమాలు చేపట్టారు. రాష్ట్రంలో  వేలాది మంది ఔట్‌‌సోర్సింగ్‌‌, కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.  వీరి భవిష్యత్‌‌ను దృష్టిలో పెట్టుకొని క్రమబద్ధీకరణ చేపట్టాలి.  సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన కొత్త ప్రభుత్వం మాట నిలుపుకోవాలి.

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం రూ. 72 వేల కోట్ల అప్పు ఉండగా ఇప్పుడది దాదాపు 7 లక్షల కోట్ల వరకు పెరగడం దారుణం.  మిగులు బడ్జెట్‌‌ నుంచి అప్పుల బడ్జెట్‌‌గా మారిందని ఈ మధ్య ఆర్థికశాఖ విడుదల చేసిన శ్వేతపత్రం ద్వారా తెలుస్తోంది. కొత్త ప్రభుత్వంపై అట్టడుగు వర్గాల ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఆచితూచి అడుగులు వేస్తూ  ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు పూనుకోవాలి.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా  ఆంధ్రప్రదేశ్‌‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న  విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.  రాష్ట్రానికి రావలసిన వాటాను రాబట్టడానికి  ప్రత్యేక కార్యాచరణతో ముందుకుపోవాలి. ఆత్మగౌరవ పాలన దిశగా ఇప్పటికే  సానుకూల అడుగులు పడుతున్నాయి. 

ప్రజాతంత్ర శక్తులను గెలిపించాలి

 ప్రజాపాలనకు ఒక కోటి 30 లక్షల దరఖాస్తులు వచ్చినందున అర్హులను గుర్తించి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. లోపాలను సరిదిద్దుతూనే.. ప్రజాపాలన అంటే ప్రజల చేత,  ప్రజల ద్వారా  ప్రజాప్రభుత్వమనే ప్రధాన సూత్రాన్ని ఆచరణలోకి తేవాలి.  గత ప్రభుత్వం మాటలతో పబ్బం గడిపింది. ప్రజాప్రాతినిధ్యానికి తిలోదకాలిచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పాలనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదు. బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌లు భిన్న ధ్రువాలుగా కనబడినా నియంతృత్వ విధానాలకు బొమ్మ, బొరుసులాంటివే.  ప్రజాహక్కుల పరిరక్షణ కోసం పార్లమెంట్‌‌ ఎన్నికలలో లౌకిక,  ప్రజాతంత్ర, వామపక్ష శక్తులను గెలిపించేందుకు ప్రజలంతా ప్రత్యేక కృషి చేయాలి.

ధరణి లోపాలు, అవినీతి లీలలు

తెలంగాణ  రెవెన్యూ చట్టం నైజాం ప్రభుత్వ కాలంలో  చేసింది.  గత ప్రభుత్వాలు కొన్ని మార్పులు, చేర్పులు చేశాయి. అయితే, సర్వే నెంబర్లవారీగా సమగ్ర సర్వే 90 సంవత్సరాల క్రితం చేపట్టింది. హద్దులు చెరిగిపోయాయి. భూ రికార్డులలో  ఒకరుంటె  మోకాపైన మరొక రైతు ఉన్నారు.  ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనాయి. 2014లో  తెలంగాణ ఏర్పడిన తరువాత సీపీఐ అనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను కలిసి భూముల అంశం జటిలమైందని, దీనిపైన అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినా కేసిఆర్‌‌ పెడచెవిన పెట్టారు. 2014 డిసెంబర్‌‌లో 58, 59 జీవోలు తెచ్చి ప్రభుత్వ తాబేదార్లు, అనుయాయులు, బ్రోకర్లకు 59 జీవో క్రమబద్ధీకరణ పేరుతో వందల కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారు.  భూ ప్రక్షాళన నినాదంతో  రెవెన్యూ సిబ్బందికి విశేష అధికారాలు ఇచ్చి, ఆ తర్వాత అవినీతి, లంచగొండిశాఖ అని కితాబిచ్చిన ఘనత కేసీఆర్‌‌కు దక్కుతుంది. రెవెన్యూ చట్టంలో పేర్కొన్న  సమగ్ర సర్వే మాటల గారడిగానే మిగిలిపోయింది. 

- చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు