2047 నాటికి ధనికదేశం కావడం కష్టమే! : మార్టిన్ వోల్ఫ్

2047 నాటికి ధనికదేశం కావడం కష్టమే! : మార్టిన్ వోల్ఫ్
  •     ఫైనాన్షియల్ టైమ్స్ నిపుణుడు మార్టిన్​

న్యూఢిల్లీ:  2047 నాటికి భారత్‌‌ను అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరే అవకాశం లేదని, అప్పటికి దేశం ఎగువ మధ్య- ఆదాయ దేశంగా మాత్రమే మారుతుందని ఫైనాన్షియల్ టైమ్స్ చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్​ మార్టిన్ వోల్ఫ్ శుక్రవారం అన్నారు. అయితే  2047 నాటికి భారత్ కూడా సూపర్ పవర్ అవుతుందని  చెప్పారు.  

ఢిల్లీలో కట్స్​ అనే సంస్థ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్​ మార్కెట్లో వృద్ధి నెమ్మదిగా ఉండటం, బలహీన ఆర్థిక వ్యవస్థల కారణంగా భారతదేశ ఎదుగుదల కష్టతరం అవుతుందని వోల్ఫ్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని అనుకూలమైన దిశలో మలచుకోవడానికి భారతదేశం తన ప్రభావాన్ని ఉపయోగించుకోవాలని, తనకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కూడా తనను తాను తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

చైనాకు ధీటుగా ఎదిగే శక్తి ఉందని, మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని ఆయన వివరించారు.  గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న 2047లో మన దేశం అభివృద్ధి చెందిన భారత్‌‌గా అవతరిస్తుందని తన గట్టి నమ్మకం ఉందని చెప్పారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశం.