అబ్దుల్లాపూర్​మెట్​లో ఘటన .. ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం

అబ్దుల్లాపూర్​మెట్​లో ఘటన .. ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం
  • కారుతో సహా చెరువులోకి..కాపాడిన స్థానికులు.. 
  • ఆర్థిక ఇబ్బందులే కారణం
  • రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో ఘటన

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మార్నింగ్ వాక్​కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకుని.. నేరుగా చెరువులోకి దూసుకెళ్లిపోయాడు. ఇది గమనించిన స్థానికులు.. తాళ్ల సాయంతో నలుగురిని కాపాడారని పోలీసులు తెలిపారు. చివరికి కారు చెరువులో మునిగిపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం ఇనాంగూడలో జరిగింది. అల్మాస్​గూడ తిరుమలనగర్​కు చెందిన అశోక్, సుజాత భార్యాభర్తలు. అశోక్ సెంట్రింగ్ కాంట్రాక్టర్​గా బిజినెస్ చేస్తుండగా.. సుజాత ఇంట్లోనే ఉంటున్నది.

బిజినెస్​లో లాస్ రావడంతో అశోక్ కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నడు. బుధవారం ఉదయం భార్యతో గొడవ జరిగింది. మార్నింగ్ వాక్​కు వెళ్దామని చెప్పి తన ముగ్గురు పిల్లలు అభిజ్ఞశ్రీ (14), శ్రీధర్ (13), సహస్ర (9)ను తన కారులో సిటీ శివారు ప్రాంతమైన ఇనాంగూడ చెరువు వద్దకు వెళ్లాడు. కారు వెళ్లేందుకు దారిలేకపోయినప్పటికీ.. చెట్ల మధ్యలో నుంచి వెహికల్ ను నేరుగా చెరువులోకి పోనిచ్చాడు. ఇది గమనించిన కల్లుగీత కార్మికులు.. గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే వాళ్లంతా తాళ్లు, ట్యూబ్​ల సహాయంతో చెరువులోకి దూకి ముగ్గురు పిల్లలు, అశోక్​ను కాపాడి ఒడ్డుకు చేర్చారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. అశోక్ ఉదయం తన భార్యతో గొడవ పెట్టుకుని పిల్లలతో బయటికి వెళ్లగానే.. అతని తమ్ముడు సంజీవ మీర్​పేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లొకేషన్ ద్వారా ఇనాంగూడ చెరువు వద్దకు చేరుకునేలోపే స్థానికులు నలుగురిని కాపాడారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు మీర్​పేట్ ఇన్​స్పెక్టర్ కీసర రాజు తెలిపారు.

కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. కాగా, నలుగురి ప్రాణాలు కాపాడిన ఇనాంగూడకు చెందిన కల్లుగీత కార్మికుడు పాండుగౌడ్, అతని కొడుకు సాయికుమార్​ గౌడ్​ను పోలీసులు అభినందించారు. తాటి చెట్టుపై కల్లు గీస్తున్న టైమ్​లో కారు చెరువులోకి దూసుకెళ్లడాన్ని చూసి.. పాండు గౌడ్ తన కొడుకుకు సమాచారం ఇచ్చాడు. స్థానికులతో కలిసి నలుగురిని కాపాడారు.