హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎల్ఆర్ఎస్దరఖాస్తులు సుదీర్ఘకా లంగా పెండింగ్ లో ఉన్నాయని, ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనా.. ప్రగతి లేకపోవడానికి కారణాలేంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీన్ని వేగవంతం చేసి, ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పారు.
శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ శాఖల పనితీరును సమీక్షించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిపై రివ్యూ చేశారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరుపైనా సమీక్షించారు. ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకొని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేయాలని భట్టివిక్రమార్క ఆదేశించారు.
అమెరికాతో హైదరాబాద్ బంధం బలమైంది
అమెరికాతో హైదరాబాద్ బంధం బలమైందని, రాబోయే రోజుల్లో ఇది మరింత బలోపేతం అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన యూఎస్ 248 ఇండిపెండెన్స్డే వేడుకలకు ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..ఈ వేడుకలకు తనను ఆహ్వానించిన అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లారెన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేసిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రపంచం మొత్తానికి పండుగ అని తెలిపారు.