డ్యూటీకి రాకపోతే ఫైన్!

ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి
సిక్ అయినా నోటీసులు అందుకోవాల్సిందే
సింగరేణి తీరుపై కార్మికుల మండిపాటు

మందమర్రి, వెలుగు: ఆరోగ్యం సహకరించక… పనిచేసే ఓపిక లేక డ్యూటీలకు రాని సింగరేణి ఉద్యోగులకు ఇక నుంచి పెనాల్టీ భారం తప్పదు. 120 సంవత్సరాల సింగరేణి చరిత్రలో పనులకు రాని కార్మికుల నుంచి ఫైన్ వసూలు చేసే పద్ధతిని యాజమాన్యం తొలిసారిగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని బొగ్గు గనుల్లో షురూ చేసింది. పనికి రాలేకపోయినందుకు సరైన ఆధారాలు చూపినా నోటీసులు అందుకోక తప్పదు. ఈ తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భంలో వందలాది మీటర్లలోతులో సరైన గాలి లేనివాతావరణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కార్మికులు పనిచేస్తుంటారు. పనిస్థలాల్లో సరైన రక్షణ చర్యలు, వసతులు లేక తరచూ అనారోగ్యం బారిన పడుతుంటారు. గనిలోకి రాకపోకలు సాగించేందుకు మ్యాన్రైడింగ్ సిస్టం అమలుల్లోకిరాని రోజుల్లోనైతే కార్మికులు కిలోమీటర్లదూరం నడిచి పని స్థలాలకు చేరేవారు. అలాంటి కార్మికులు కాళ్లు, కీళ్లనొప్పులతో బాధపడుతూ తరచూ డ్యూటీలకు రారు. డ్యూటీలకు ఎగనామం పెడుతున్నారనే సాకుతో అలాంటి వేలాది మందిని యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇలా సింగరేణి వ్యాప్తంగా 1993 నుంచి 2010 వరకు సుమారు 15 వేల మందిని డిస్మిస్ చేశారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని వారంతా 16 ఏండ్లుగా ఉద్యమిస్తున్నారు.

కౌన్సిలింగ్ తో మార్పు రావడంలేదని..
తరచూ డ్యూటీలకు నాగాలు పెట్టె ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మార్పు తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా గైర్హాజరు 20 నుంచి 25 శాతం ఉంటుంది. ప్రస్తుతం 46 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరి సంఖ్యను రానున్న రోజుల్లో సగం చేయడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెనాల్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కార్మికుల్లో మార్పు తీసుకువచ్చి హాజరు శాతం పెంచడానికే పెనాల్టీ నిర్ణయమంటూ సింగరేణి యాజమాన్యం చెబుతోంది. మరోవైపు అనారోగ్యంతో డ్యూటీకి హాజరు కాలేకపోయామని సరైన ఆధారాలు చూపించినా సర్వీసుపై ప్రభావం చూపే ఛార్జీషీట్(నోటీసులు) మాత్రం తప్పనిసరి చేసింది.

నాగాలను బట్టి ఫైన్
కార్మికులు సంవత్సరంలో 26 నుంచి 50 రోజుల వరకు డ్యూటీలకు హాజరు కాకపోతే రూ.250 ఫైన్ కట్టాలని యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 51 నుంచి 75 వరకు నాగాలుంటే రూ.500, 76 నుంచి 100 వరకు రూ.750, 101 నుంచి 125 వరకు రూ.1,000, 126 నుంచి 150 వరకు 1,250, 151 నుంచి 175 వరకు రూ.1,500, 176 నుంచి 200 రోజుల వరకు నాగాలుంటే రూ.1,750 లను పెనాల్టీగా చెల్లించాల్సిందే.హోదా ఆధారంగా పెనాల్టీ కూడా మారుతుంది. ట్రేడ్మెన్, షాట్ ఫైరర్, సర్ధార్ డ్యూటీ నిర్వహించే సూపర్ వైజర్లు రెండింతలు, ఫోర్మెన్, ఓవర్మెన్, జెఎంఈటీ, క్లర్కులు మూడింతల పెనాల్టీ చెల్లించాలని సింగరేణి యాజమాన్యం పేర్కొంటోంది.

ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి
డ్యూటీలకు రాకపోతే ఫైన్ విధించడంతో పాటు ఛార్జి షీట్ జారీ చేస్తామని మందమర్రి ఏరియా ఆఫీసర్లు జారీచేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. సింగరేణి వ్యాప్తంగా సంస్థకు వర్తించే కంపెనీ స్టాండింగ్ ఆర్డర్లుంటాయే తప్ప ఏరియాలకు విడిగా ఉండవు. ఉద్యోగులపై పనిభారం మోపుతూ వారి సంఖ్యను తగ్గించే కుట్రలో భాగమే పెనాల్టీ నిర్ణయం.
-మందా నర్సింహారావు, సీఐటీయూనేత

For More News…

జనాలకు కరోనా పాఠాలు.. మీటింగులకు లీడర్లు