యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తుండగా.. ఎస్పీఎఫ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఫైన్ విధించి వదిలిపెట్టారు. ఆలయ ఆఫీసర్ల అనుమతి పొందకుండా బుధవారం రాత్రి హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన యువకులు సాయికిరణ్, జాన్ మోసెజ్ ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తుండగా. ఎస్పీఎఫ్ సిబ్బంది గమనించి అదుపులోకి తీసుకున్నారు.
గురువారం దేవస్థాన ఆఫీసర్లు వారికి రూ.10 వేల జరిమానా విధించి వదిలిపెట్టినట్లు తెలిసింది. గతంలో ఇదే తరహాలో డ్రోన్ కెమెరాతో వీడియోలు చిత్రీకరించిన వ్యక్తులను దేవస్థాన అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించగా.. నిందితులపై కేసు నమోదు చేశారు. కానీ దీనికి విరుద్ధంగా బుధవారం పట్టుబడ్డ యువకులను పోలీసులకు అప్పగించకుండా ఆలయ ఆఫీసర్లే ఫైన్ విధించి వదిలిపెట్టడం పలు సందేహాలకు తావిస్తోంది.