తెలంగాణ సర్కార్ కు షాక్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై కేంద్రం సీరియస్.. జరిమానా

తెలంగాణ సర్కార్ కు షాక్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై కేంద్రం సీరియస్.. జరిమానా

ఉప్పల్ - మేడిపల్లి ఎలివేటెడ్ కారిడార్ జాప్యం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కారిడార్ పనులు పూర్తి కాకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఐదున్నరేళ్లుగా ఆలస్యమవుతున్న ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ. కారిడార్ జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థలే కారణమని తేల్చిన కేంద్రం జరిమానా విధించింది. 

హైదరాబాద్ - వరంగల్ మధ్య 163 హైవేపై ట్రాఫిక్ ని తగ్గించేందుకు 2017లో ఎలివేటెడ్ కారిడార్ ను ప్రతిపాదించింది ప్రభుత్వం.. ఉప్పల్ నుండి మేడిపల్లి మధ్య 6.2 కిలోమీటర్ల మేర 45మీటర్ల పొడవుతో సిక్స్ లైన్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. హైదరాబాద్ లోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత ఇదే పెద్ద ఫ్లైఓవర్. 2018 జూలైలో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు 2020 జూలై నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. రూ.670 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ కారిడార్ పనులు కాంట్రాక్టు సంస్థ తీరు వల్ల జాప్యమవుతూ వస్తున్నాయి.

మొదట 25శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న రష్యన్ కంపెనీ.. ఆ తర్వాత చేతులెత్తేసింది. 43శాతం పనులు చేసి ఆపేయడమే కారిడార్ జాప్యానికి ప్రధాన కారణం. కారిడార్ అసంపూర్తిగా నిలిచిపోవటంతో ఆ ప్రాంతంలో ప్రయాణం వాహనదారులకు నరకంగా మారింది. 

జాప్యానికి కారణం నిర్మాణ సంస్థే:

ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో 20 నెలల్లో పూర్తి చేయాలని.. 2026 అక్టోబర్ నాటికి కారిడార్ పూర్తవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే.. కారిడార్ పనులు ఆలస్యం అవుతున్న క్రమంలో టెండర్ ఒప్పందాన్ని రద్దు చేసి మరో నిర్మాణ సంస్థకు అప్పగించాలని అధికారులు భావించినప్పటికీ...దీని పనులు మరింత ఆలస్యం అవ్వటమే కాకుండా ఖర్చు కూడా భారీగా పెరుగుతుందని.. పాత నిర్మాణ సంస్థనే కొనసాగించారు. 

రూ. 28కోట్ల పెనాల్టీ:

ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ కారణమని తేల్చింది కేంద్రం.. భూసేకరణ సకాలానికి పూర్తి చేయకపోవడం... స్తంబాలు, ఇతర కట్టడాలు తొలగించటంలో జాప్యం వల్ల కారిడార్ పనులు ముందుకు సాగలేదని గుర్తించిన కేంద్రం భవిష్యత్తులో చేసే ఖర్చులో 10శాతం జరిమానా విధించింది. జరిమానాను రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ సమానంగా భరించాలని ఆదేశించింది. 

ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం రూ.425.10 కోట్లు కాగా..  ఇంకా 225.56 కోట్ల పని చేయాల్సి ఉందని లెక్క తేలింది. కానీ, ఆ మొత్తంతో పని పూర్తి కాదని తేల్చిన అధికారులు మరో రూ.60 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు. అంటే.. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తవ్వటానికి ఇంకా రూ. 286 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందన్నమాట. పెరిగిన అంచనా వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందనిస్పష్టం చేసింది కేంద్ర ఉపరితల రవాణా శాఖ.